డాన్స్‌లో రాణించడం అంత ఈజీ కాదు. అనుకున్న లక్ష్యాన్ని, కలని నెరవేర్చుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్ళను, అడ్డంకులను ఎదుర్కోవడమూ సులభతరం కాదు. అయినప్పటికీ విజేతలుగా నిలవాలనే ధృడ సంకల్పమే ఎదురయ్యే అన్ని అవరోధాల్ని దాటే ధైర్యాన్ని, శక్తినిస్తుంది. ఈ నేపథ్యంతో రూపొంది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన కొన్ని డాన్స్ బేస్డ్ చిత్రాల గురించి
ఈ వారం అందిస్తున్న స్పెషల్
షో..
ది వైట్ క్రౌ
రష్యన్ సోవియెట్ బ్యాలెట్ డాన్సర్ రుడోల్ఫ్ నురేయేవ్ జీవితాన్ని తెలిపే చిత్రమిది. రష్యాకి చెందిన పాపులర్ బ్యాలెట్ డాన్సర్ రుడోల్ఫ్ సోవియట్ రష్యాలో కోల్డ్ వార్ టైమ్‌లో కిరోవ్ బ్యాలెట్ కంపెనీ తరఫున ప్రదర్శనలు ఇస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. అంతర్జాతీయంగా దృష్టి పెట్టి, లండన్‌కి చెందిన ది రాయల్ బ్యాలెట్ సంస్థ ద్వారా తన బ్యాలెట్ డాన్స్ ప్రదర్శనలు ఇచ్చి అత్యంత పాపులారిటీని సంపాదించి అప్పట్లో సంచలనం సృష్టించారు. దీంతోపాటు పారిస్ ఓపెరా బ్యాలెట్‌ని స్వయంగా నడిపించారు. అత్యంత స్పూర్తివంతమైన ఆయన ప్రయాణం ఆధారంగా దర్శకుడు రాల్ఫ్ ఫీన్నెస్ ఈ చిత్రాన్ని 2018లో తెరకెక్కించారు. రుడోల్ఫ్ పాత్రలో ఒలెగ్ ఇన్వెంకో నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇది బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు క్రిటికల్‌గానూ ప్రశంసలందుకుంది.
డ్రివెన్ టు డాన్స్
వరల్డ్ కాంపిటీషన్లో డాన్సర్‌గా రాణించాలనుకునే ఓ విద్యార్థి స్ట్రగుల్‌ని తెలిపే చిత్రమిది. పెగ్ అనే డాన్స్ స్టూడెంట్ అంతర్జాతీయ బ్యాలెట్ డాన్స్ కాంపిటీషన్లో తానేమిటో నిరూపించుకోవాలనుకుంటుంది. దీని కోసం ఎన్నోసార్లు ఆడిషన్స్ ఇస్తుంది. అలాగే దీని నిర్వాహకులను కలిసేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అంతేకాదు చాలాసార్లు తిరస్కరించబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ పెగ్ విజయవంతంగా ఆడిషన్ ఎలా ఇచ్చింది?, అంతర్జాతీయ బ్యాలెట్ డాన్స్ కాంపిటీషన్లో విజేతగా నిలిచేందుకు ఏం చేసిందనే కథాంశంతో ఈ డాన్స్ డ్రామా చిత్రం రూపొందింది. టాటి వోట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. స్ఫూర్తివంతంగా నిలిచిన ఈ సినిమాలో డాన్సర్‌గా జులియెట్ డోహెర్టీ నటన ఆసాంతం కట్టిపడేస్తుంది. ఆమె చేసిన బ్యాలెట్ డాన్స్ ప్రేక్షకుల్ని ఫిదా చేసింది.
పొలినా
ఓ డాన్సర్ స్ట్రగుల్‌ని తెలిపే చిత్రమిది. పొలినా అనే టీనేజ్ డాన్సర్ బ్యాలెట్ డాన్సర్‌గా రాణిస్తుంది. బ్యాలెట్ డాన్స్‌తోపాటు అన్ని రకాల డాన్సులను తనదైన స్టయిల్లో చేయాలనుకుంటుంది.
డాన్స్ స్కూల్లో చేరి శిక్షణ కూడా తీసుకుంటుంది. అక్కడ కొరియోగ్రాఫర్ పొలినాని పరీక్షిస్తుంది.
ఆ పరీక్షలోనూ గెలిచి పొలినా బ్యాలెట్ డాన్స్‌లో ప్రతిభని చాటుకుంటుంది. ఈ క్రమంలో ఆడ్రీన్తో ప్రేమలో పడుతుంది. అతని కోసం మోడ్రన్ డాన్స్ నేర్చుకునేందుకు అతనితో కలిసి వెళ్తుంది.
బ్యాలెట్ డాన్స్‌తో పోల్చితే మోడ్రన్ డాన్స్ చాలా భిన్నమైనది, క్లిష్టమైనది. అందులో రాణించేందుకు అనేక స్ట్రగుల్స్ పడి ఫెయిల్ అవుతుంది. దీంతో తన ప్రియుడు మరో అమ్మాయితో చనువుగా ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో పొలినా మానసికంగా ఎదుర్కొన్న స్ట్రగుల్స్, డాన్స్‌లో రాణించేందుకు పడిన ఇబ్బందులను తెలిపే చిత్రమిది. ఆద్యంతం డాన్స్ డ్రామాగా సాగే ఈ సినిమాకి వలెరీ ముల్లర్,
ఆంగెలిన్ ప్రెల్జోకాజ్ దర్శకత్వం వహించారు. 2016లో సినిమా విడుదలై ప్రశంసలందుకుంది.
వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది.
ది డాన్సర్
అమెరికన్ పాపులర్ డాన్సర్ లోయి ఫుల్లర్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది.
మ్యారీ ల్యూయిస్ ఫుల్లర్ చిన్నప్పట్నుంచి డాన్సర్‌గా రాణిస్తుంది. అతి తక్కువ వయసులోనే డాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంటుంది. అంతేకాదు మోడ్రన్ డాన్స్, థియేట్రికల్ లైటింగ్‌తో
కూడిన ప్రత్యేక డాన్స్‌తో వరల్డ్ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసి సంచలనం సృష్టించింది. సంచలనాత్మకమైన డాన్సర్‌గా 1880 నుంచి 1910 మధ్య కాలంలో ఓ ఊపుఊపారు. అంతగా పాపులర్ అయిన లోయి ఫుల్లర్ జీవితంలో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులను, స్ట్రగుల్స్‌ని, లెగసీని ఈ చిత్రం తెలియజేస్తుంది. ఈ బయోగ్రాఫికల్ హిస్టారికల్ డాన్స్ డ్రామా చిత్రానికి స్టీఫానీ డి గ్యూస్టో దర్శకత్వం వహించారు. లోయి ఫుల్లర్ పాత్రలో
సోకో నటన మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇది కేన్స్‌లోనూ ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. 2016లో విడుదలై ప్రేక్షకుల అభినందనలతోపాటు
పలు ఇతర అవార్డులనూ ఈ చిత్రం సొంతం చేసుకుంది.
డాన్స్ క్యాంప్
ప్యాషనేట్ డాన్సర్‌కి సరైన తోడు దొరికితే ఎలా ఉంటుందో తెలిపే చిత్రమిది. హంటర్ అనే కుర్రాడు అద్భుతమైన డాన్సర్. తనకి సరైన జోడీ లేక ఇబ్బంది పడుతుంటాడు. ఓ సమ్మర్లో అతని తల్లి డాన్స్ క్యాంప్‌కి పంపిస్తుంది. అక్కడ తనకి ఏమాత్రం సౌకర్యంగా ఉండదు. కానీ అందులోని డాన్సర్స్‌లో మరో ప్యాషనేట్, ఎనర్జిటిక్ లేడీ డాన్సర్‌ని కనిపెడతాడు. ఆమెతో కలిసి డాన్స్ కాంపిటీషన్లో విజేతగా నిలవడం, వీరిద్దరి జోడి పలు సంచలనాలు సృష్టించడమనే కథాంశంతో ఈ మ్యూజికల్ డాన్స్ కామెడీ డ్రామా తెరకెక్కింది.
దీనికి బెర్ట్ దర్శకత్వం వహించారు. హంటర్ పాత్రలో నాడ్జి జెటర్ నటించాడు. తనకి తోడుగా మెగ్ డె ఏంజెలిస్ నటించింది. ఇది 2016లో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది.
లిఫ్ట్ మీ అప్
ఓ ప్యాషనేట్ డాన్సర్ తన డాన్స్ కలని, ఇంటిలోని స్ట్రగుల్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేసిందనే కథతో ఈ చిత్రం రూపొందింది. జాన్ అనే లేడీ బ్యాలెట్ డాన్సర్ అందులో రాణిస్తున్న సమయంలోనే తల్లి మరణిస్తుంది.
దీంతో ఒంటరైపోతుంది. తన స్టెప్ ఫాదర్‌తో ఇమడలేకపోతుంది.
కుటుంబ పరంగా అనేక సవాళ్ళు ఎదురవుతుంటాయి. ఈ అడ్డంకులన్నింటిని చక్కదిద్దుకుని తనకిష్టమైన నృత్యంలో ఛాంపియన్‌గా నిలిచేందుకు తాను పడిన స్ట్రగుల్స్‌ని తెలిపే చిత్రమిది. అనేక సవాళ్ళని ఎదుర్కొని తనని తాను ప్రొఫెషనల్ డాన్సర్‌గా మలుచుకునే పాత్రలో సారా ఫ్రాంగెన్బర్గ్
అద్భుత నటనతో మైమరపించారు. స్టెఫ్ ఫాదర్‌గా టాడ్ కాహూన్ నటన ఆకట్టుకుంటుంది. 2015లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అండ్ దెన్ వి డాన్డ్స్
ఆద్యంతం నాటకీయభరితంగా సాగే స్వీడన్, జార్జియన్ డాన్స్ ప్రధాన చిత్రమిది. మెరాబ్, అతని పార్టనర్ మేరీ ఇద్దరు డాన్స్ జోడి. తమదైన ప్రత్యేక డాన్స్‌తో ఆకట్టుకుంటుంటారు. వీళ్ళు నేషనల్ జార్జియన్ ఎన్సెంబుల్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్న టైమ్‌లో ఇరాకి అనే ఓ అందమైన, అత్యంత ప్రతిభకలిగిన డాన్సర్ వస్తాడు. దీంతో మెరాబ్లో తడబాటు ప్రారంభమై డాన్స్ టెక్నిక్స్ మిస్ అవుతుంటాడు. అంతేకాదు గాయపడతాడు కూడా. ఈ నేపథ్యంలో మోరాబ్, ఇరాకిల నృత్యం ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా. లెవన్ అకిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై ఆకట్టుకుంది. స్వీడన్ నుంచి ఆస్కార్ నామినేషన్స్‌కి పంపబడింది. మెరాబ్గా లెవన్, మేరీగా అనా జవకిశ్విలి, ఇరాకిగా బాచి వలిష్విలి నటించారు.
లెట్స్ డాన్స్
హిప్హాప్ డాన్సర్ జర్నీని తెలిపే చిత్రమిది. జోసెఫ్ హిప్హాప్ డాన్స్‌లో అత్యంత ప్యాషనేట్ డాన్సర్‌గా రాణిస్తుంటాడు. పారిస్‌లో జరిగే కాంపిటీషన్ కోసం పలు కంపెనీలకు ఆడిషన్స్ ఇచ్చినప్పటికీ సెలెక్ట్ కాడు.
దీంతో తన ప్రియురాలు ఎమ్మా, తన బెస్ట్ ఫ్రెండ్ కరీమ్‌తో కలిసి ఓ బృందంగా జాతీయ, అంతర్జాతీయ హిప్హాప్ కాంపిటీషన్లో పాల్గొంటాడు. ఈ క్రమంలో జోసెఫ్ విజేతగా నిలిచేందుకు ఎలాంటి స్ట్రగుల్ పడ్డాడు?,
తన బృందం ఎదుర్కొన్న సవాళ్ళు, అవమానాలు, అడ్డంకులను తెలిపే స్ఫూర్తివంతమైన చిత్రమిది.
ఈ ఫ్రెంచ్, బెల్జియం చిత్రానికి లాడిస్లాస్ చోల్లాట్ దర్శకత్వం వహించారు. ఇది గతేడాది విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇందులో హిప్ హాప్ డాన్సర్ జోసెఫ్‌గా రయానె బెన్సెట్టీ, ప్రియురాలిగా
ఫియోరెల్లా కాంపనెల్లా, ఫ్రెండ్‌గా, మెహెదీ కెర్కౌచె నటించారు.
బ్యాటిల్ డాన్సర్‌గా రాణించాలనుకునే ఓ అమ్మాయి జీవితంలోని ఒడిదుడుకులను తెలిపే చిత్రమిది.
అమేలీ అనే డాన్సర్ స్కూల్లో మంచి డాన్సర్‌గా రాణిస్తుంది. బాడీ పరంగా ఫిట్‌గా
ఉంటూ ఆర్థికంగా బాగా ఉన్నతంగా ఉండాలనుకుంటుంది. అలాగే తన డాన్స్‌లో సైతం ఉన్నతంగానూ రాణించాలనుకుంటుంది. కానీ విధి మరోలా ఆమె జీవితాన్ని మార్చింది.
ఓ ఘటన వల్ల తండ్రి అప్పుల్లో కూరుకుపోతాడు. దీంతో అమేలీ ఊహలన్ని చెదిరిపోతాయి. అయితే తన జీవితంలో ఏం జరగలేదన్నట్టు, అంతా బాగానే ఉన్నట్టు స్కూల్లో నటిస్తుంది. అబద్దానికి, నిజానికి మధ్య ఘర్షణ పడుతుంటుంది.
ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన స్ట్రీట్ డాన్సర్ పరిచయంతో ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనేది సినిమా. కేథరినా లానింగ్ దర్శకత్వం వహించిన ఈ నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్ మ్యూజికల్ డ్రామా చిత్రం 2018లో విడుదలై ఆకట్టుకుంది. ఇందులో అమేలి పాత్రలో
లిసా టీగే నటన ఆద్యంతం మంత్రముగ్ధుల్ని చేసింది.
వీటితోపాటు 'ది వే వి డాన్స్', 'ఫైవ్ డాన్సెస్', 'మ్యాజిక్ మైక్', 'ఫూట్లూస్','యు గాట్ సర్వ్డ్ బీట్ ది వరల్డ్', 'వన్ ఛాన్స్ టు డాన్స్', 'మేక్ యువర్ మూవ్' వంటి తదితర చిత్రాలు భిన్న డాన్స్ ప్రధాన చిత్రాలుగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి. అంతేకాదు వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షమూ కురిపించాయి.
హోప్ డాన్స్
బ్యాలెట్ డాన్సర్‌గా రాణించాలనుకునే ఓ మల్టీటాలెంటెడ్ టీనేజ్ అమ్మాయి జీవితంలోని మలుపులను తెలిపే చిత్రమిది. హోప్ డగ్లస్ అనే టీనేజ్ అమ్మాయికి బ్యాలెట్ డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనేది డ్రీమ్. తల్లి కూడా హోప్‌కి పూర్తి సహకారాన్ని అందించడమే కాకుండా గొప్ప డాన్సర్‌గా చూడాలనుకుంటుంది. అయితే తండ్రి మాత్రం హోప్‌ని ఓ క్రీడాకారిణిగా చూడాలనుకుంటాడు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హోప్
ఎలాంటి నిర్ణయం తీసుకుంది?, తన కలని నిజం చేసుకుందా లేక తండ్రి కలని నిజం చేసిందా అనేది సినిమా. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ డాన్స్
ప్రధాన భావోద్వేగభరిత చిత్రానికి ఆండ్య్రూ డిల్లన్ దర్శకత్వం వహించారు.
హోప్ పాత్రలో అవరోస్ డిల్లన్ నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. తండ్రిగా మైకేల్ స్వాన్, తల్లిగా సన్నీ డోంచ్ నటించారు. 2017లో సినిమా విడుదలై మంచి విజయం సాధించడంతోపాటు అనేక పురస్కారాలను సొంతం చేసుకుంది.
Authorization