స్మార్ట్ ఫోన్ చేతిలో లేనిదే రోజుగడవని కాలమిది. అన్నిపనుల్లో భాగంగానే ఫోన్ కూడా ఓ భాగమైపోయింది. ఇలా ప్రతి పనిలోనూ ఫోన్‌ను ఉపయోగించటం ఒకవంతైతే అది మొరాయిస్తే ఎలా అనేది మరో విషయం. చిన్న చిన్న ఆప్షన్లను హ్యాండిల్ చేయటం ద్వారా ఫోన్ మొరాయింపులకు కొంచెం చెక్ పొట్టొచ్చు. అవేంటో చూద్దాం..
యూఐ జామ్
ఫోన్ స్క్రీన్ ఉన్నట్టుండి ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది. రీస్టార్ట్ చేయడంతో మళ్లీ పనిచేయడం మనం చూసే ఉంటాం. ఒకవేళ రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా స్క్రీన్‌లోని యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ) పనిచేయలేదనుకోండి. దీనికి సంబంధించి క్యాష్ (కేసీ) మెమరీని తొలగించుకోవడం ద్వారా కొంత ఫలితముంటుంది. క్యాస్ వైప్ చేసుకునేందుకు సెట్టింగ్స్‌లోని ఆప్ ట్యాబ్‌కు, అందులోని ఆల్ సెక్షన్‌కు వెళ్లి యూజర్ ఇంటర్ఫేస్ను సెలెక్ట్ చేసుకోవాలి.
ప్లే స్టోర్ క్రాష్
ఇన్‌బిల్డ్‌గా వచ్చే గూగుల్‌ప్లే స్టోర్ తరచూ క్రాష్ కావడం పరిపాటే. దీనికి వైరస్, మాల్, యాడ్వేర్లతో సంబంధం లేదు. క్యాష్ మెమరీలో తేడాలు రావడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. క్యాష్ మెమరీని క్లియర్ చేస్తే ఈ సమస్య తీరినట్టే. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆప్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి, కుడివైపునకు స్వాప్ చేస్తూ వెళితే 'ఆల్' అన్న ట్యాబ్ కనిపిస్తుంది. దాంట్లో గూగుల్ ప్లే స్టోర్‌ను గుర్తించి డేటా, క్యాష్‌లను తుడిచేయండి. ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. అప్పటికీ సమస్య తీరకపోతే గూగుల్ ప్లే సర్వీసెస్, గూగుల్ సర్వీసెస్ ఫ్రేమ్‌వర్క్‌లలోని డేటా, క్యాష్‌లను కూడా క్లియర్ చేయండి.
అప్లికేషన్లు డౌన్లోడ్ కాకపోతే...
కొన్ని సార్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్లు డౌన్లోడ్ కాకుండా ఇబ్బంది పెడుతుంటాయి. దీనికి రెండు రకాల పరిష్కారాలున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ క్యాష్ మెమరీని వైప్ చేయడం ఒకటైతే... గూగుల్ ప్లేస్టోర్ హిస్టరీని ఎరేజ్ చేయడం రెండో పద్ధతి. క్యాష్‌ను వైప్ చేయడమెలాగో ఇప్పటికే చూశాం. హిస్టరీని తొలగించాలంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయండి. అందులో క్లియర్ హిస్టరీని సెలెక్ట్ చేసుకుంటే సరి.
వీడియో ప్లే కాకపోతే...
మొబైల్లో ఇన్‌బిల్ట్‌గా వీడియో ప్లేయర్స్ వస్తుంటాయి. అయినా ఒక్కోసారి వీడియోలు స్టక్ అవుతుంటాయి. వీటిని సరి చేయడానికి థర్డ్ పార్టీ ప్లేయర్లు వాడండి. వాటిలో కూడా వీడియో ప్లే కాకపోతే దాంట్లోని ఫార్మాట్ సపోర్ట్ చేయ డం లేదని అర్థం. మామూలుగా వీఎల్సీ, ఎంఎక్స్ ప్లేయర్లు చాలావరకూ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తాయి.
మొబైల్లో స్పేస్ లేదా?
ఎన్నో అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని... కొంత కాలం తర్వాత స్పేస్ లేదని చిరాకు పడుతుంటాం. స్మార్ట్‌ఫోన్‌లో మెమరీని సద్వినియోగం చేసుకు నేందుకు అనేక అప్లికేషన్లు ఉన్నాయి. వీటితో కొంత మెమరీని సేవ్ చేసుకోవచ్చు. అలాకాకుండా అప్లికేషన్లను అన్ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా మెమరీని ఆదా చేయొచ్చు. అయితే స్పాటిఫై వంటి మ్యూజిక్ ఆప్స్ అన్ ఇన్స్టాల్ చేసేందుకు అవి ఎక్కడున్నాయో తెలియాలి. అటువంటి సందర్భాల్లో సీసీ క్లీనర్ వంటి అప్లికేషన్లు వాడటం మంచిది. డిస్క్ యూసేజ్ వంటి వాటితో ఏ అప్లికేషన్ ఎంత మెమరీ తీసుకుంటోందో చూసుకోవచ్చు. తదనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు
ఆన్ అవుతూనే ఫోన్ క్రాష్ అవుతూంటే..
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బూట్ కాకుండా సతాయించడం, పదే పదే క్రాష్ కావడంలాంటి సమస్యలు ఉంటే దాన్ని సేఫ్ మోడ్‌లో ఆన్ చేయడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. అయితే.. సేఫ్‌మోడ్‌లో ఎలా ఆన్ చేయడం అన్నది ఒక ప్రశ్న. దీనికి కూడా ఒక సింపుల్ పద్ధతి ఉంది. ఫోన్ పవర్‌బటన్‌ను కొద్దిసేపు నొక్కి పట్టుకుంటే... పవర్ ఆఫ్ అన్న ఆప్షన్ వస్తుంది. పవర్ ఆఫ్ ఆప్షన్‌ను కూడా కొద్దిసేపు నొక్కి పట్టి ఉంచితే ఫోన్‌ను సేఫ్ మోడ్‌లో రీబూట్ చేయాలా? అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరి. ఒకసారి మీరు సేఫ్‌మోడ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఆన్ చేసిన తర్వాత అనవసరమైన తేడాగా ఉన్న అప్లికేషన్లను తొలగించి రీస్టార్ట్ చేస్తే బూటింగ్ సమస్య పోతుంది.
Authorization