- నమ్మకాలు నిజాలు
ప్రశ్న: చండీయాగం తదితర యాగాలు, యజ్ఞాలు చేస్తే లోకకల్యాణం జరుగుతుందా? యాగాలు, యజ్ఞాల వల్ల శాస్త్రీయ ప్రయోజనం ఉందా?
- ఎ.ఎన్.శాస్త్రి, హైదరాబాద్
జవాబు: యాగాలు, యజ్ఞాలు తదితర క్రతువుల వల్ల ధనం, కాలం వృధా కావడంతో పాటు ప్రజలను తిరోగమన భావజాలంలోకి నెట్టడం తప్ప మరో ప్రయోజనం ఇసుమంత కూడా లేదు. ప్రాచీనకాలంలో ప్రజల మధ్య వర్ణవ్యవస్థను పదిలం చేసే ప్రయత్నంలో అల్ప వర్గాల ప్రజా సమూహాల్ని సమ్మోహనం చేసేందుకు, వారిని భ్రమల్లో ఉంచడానికి, సమస్యలకు కారణాల్ని నిజ సమాజంలో కాకుండా, పాలకుల పాలనా విధానాలతో కాకుండా, వారి పాలసీలతో పద్ధతులతో కాకుండా మిధ్యలవైపు మళ్లించి ప్రజల్ని ఏమార్చి దోచుకోవడానికి వీలుగా ఇలాంటి యజ్ఞాలు, యాగాలు, తంతులు రూపొందించారు.
ఈ విశాల విశ్వంలో ఏ సంఘటన జరిగినా, జరగాలన్నా అది కేవలం నాలుగే విధాల బలాల ప్రమేయంతో జరుగుతుంది. వాటి పేర్లు 1. బలమైన కేంద్రక బలాలు( Strong nuclear forces) 2. బలహీనమైన కేంద్రక బలాలు (Weak nuclear forces) 3. గురుత్వాకర్షక బలాలు (Gravitational forces) 4. విద్యుదయస్కాంత బలాలు (Electromagnotic forces). ఇందులో మొదటి రెండు బలాలు పరమాణు కేంద్రకంలో తప్ప అవి మన నిజ జీవితంలో బాహాటంగా కనిపించవు. రోజువారీ సంఘటనలలో అవి ద్యోతకం కావు. మిగిలిన రెండు బలాల కన్న అవి చాలా బలోపేతమైనవే అయినా వాటి పరిధి పరమాణు కేంద్రకం వరకే! 'నీటిలోని మొసలి నిగిడి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బలిమి కాదయా, విశ్వదాభిరామ వినురవేమ' అని వేమన శతకంలో చెప్పినట్లు బలమైన కేంద్రక బలాల బలం కేవలం మిల్లిమీటరులో 100 కోట్ల వంతు స్థలంలో ఉన్న కేంద్రకాన్ని మించి బయట పడదు. మనకు రోజువారి తటస్థపడే సకల కార్యకలాపాలకు, పరిశీలనలకు, దృగ్విషయాలకు, సంఘటనలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తుట్టతుదకు గురుత్వ బలాలు లేదా విద్యుదయస్కాంత బలాలే కారణం. ఇంతకు మించి మరే బలాలు లేవు. యాగబలం, గ్రహబలం, తపోబలం, మనోబలం, ధనబలం, అధికారబలం- ఇలాంటి వన్నీ సామాజిక, సాంప్రదాయక భావనలు తప్ప శాస్త్రీయతపై ఆధారపడ్డ కొలమానీయ బలాలు కావు.
లోక కల్యాణార్థం అంటూ తమ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి యజ్ఞాలు, యాగాలు చేయడం పరిపాటి అయింది. చండీయాగం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే గూగుల్లో మీరు Chandi yagam అని టైప్ చేస్తే పదుల కొద్దీ లింకులు వస్తాయి. అందులో దేనిలోనూ చండీయాగం చేస్తే ఏమి కలుగుతుందో శాస్త్రీయంగా వివరించరు. కేవలం తలాతోక లేని పదాల్ని, వాక్యాల్ని వల్లె వేస్తారు. ఒకదానితో మరోదానికి పొంతన లేని వ్యాఖ్యానాలు ఉంటాయి. ఓ వైపు ఆదిపరాశక్తి అంటూ చండీమాతను పోలుస్తారు. ఆదిశక్తి (first energy), పరాశక్తి (last energy) రెండూ ఆమే అంటారు. ఆమె లేనిచోటు ఉండదంటారు. ఆమెను బ్రహ్మరుద్రాదులు పూజిస్తారు అంటారు. బ్రహ్మ సృష్టికర్త అంటారు. ఆమెను అనుగ్రహం చేసుకోవడానికి ఋషులు చండీయాగాన్ని రూపొందించారంటారు. ఆమెను సంతుష్టి చేయడానికి క్రతువు చేయాలంటారు. ఆదిపరాశక్తి సకల చరాచర జగత్తులో ఆమే ఉండగా, ఆమెకు ఏమి తక్కువయిందని మనం ఆమెను సంతుష్టి చేయాలో చెప్పరు. ఆమె అనుగ్రహం పొందడానికి అంతటి మహాశక్తి శాలికి లంచంగానో, కానుకగానో యాగాలు ఎందుకు చేయాలో వివరించరు. ప్రజలకున్న భయాలు, అశక్తులు, కష్టాలు, నష్టాలు, అసంతృప్తులు, వేదనలు, అనారోగ్యాలు, ఆందోళనలు, అగచాట్లు అయోమయాలు వాస్తవాలు. ఆ వాస్తవాల వెనుక నిజ సమాజ ఆర్థిక సాంఘిక, సాంస్కృతిక, పాలక విషయాలున్నాయి. ప్రజలు, ప్రజల ఈతిబాధలు వర్తమాన జాగృత సత్యాలు. తన కుమార్తె వివాహానికి 3000 కోట్ల రూపాయలు వెచ్చించే ధనవంతుడు, నెలకు 3000 రూపాయలు కూడా కుటుంబ నిర్వహణకు వాడుకోని పేదవాడు ఒకే నేలపై నివసిస్తున్న ప్రపంచంలో వనరుల మొత్తంలో దాదాపు 80 శాతం ప్రపంచంలో ఒకటి రెండు శాతానికి మించని కొద్దిమంది చేతిలో ఉంటే మిగిలిన 99 శాతం మందికి 20 శాతమే ఉండగా ఆదిపరాశక్తి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. ప్రపంచంలోని సగం మంది ప్రజలకు దినసరి వేతనం గడ్డుస్థితిలో ఉన్నా ఆ మహా మాతకు తన బిడ్డల మీద కరుణ రావడంలేదు. కోట్లాది తన సంతతిలో వందలలోనే ఉన్నవారు అన్నీ అనుభవిస్తుండగా, కోట్లాది మంది తన పిల్లలు పలు కష్టాలతో వ్యధ చెందుతుంటే ఆ తల్లికి పట్టు వస్త్రాలు, నెయ్యి, కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన యజ్ఞాలు చేస్తేగానీ లోక కల్యాణం జరగదని అంటున్నారు. అలాగని లోక కల్యాణార్థం ఎంతమంది ఇప్పటివరకు చండీయాగాలు చేయడం లేదు? వేలాదిగా చేస్తూనే ఉన్నారు. మరి లోక కల్యాణం ఎందుకు జరగడం లేదు. లోక కల్యాణార్థ క త చండీయాగ పూర్వం, లోక కల్యాణార్థ కృత చండీయాగానంతరం ప్రపంచగతిలో, ప్రజల జీవన ప్రయాణాల్లో మార్పులు ఏవన్నా వస్తున్నాయా? వ్యక్తుల నమ్మకాలకు మాత్రమే చండీయాగం పరిమితమయితే దానికి లోక కల్యాణం అని పేరు పెట్టడంలో ఔచిత్యం ఎక్కడిది.
శాస్త్రీయ దృక్పథం, మానవతా దృష్టి, తార్కిక బుద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రశ్నించే ధైర్యం ఉండడం భారత పౌరుల ప్రాథమిక కర్తవ్యం అన్న విధంగా వున్న రాజ్యాంగం మీద ఒట్టు పెట్టుకొని గద్దె లెక్కిన మహనీయులు ప్రజలకు ఆదర్శ ప్రాయంగా ఉండాలి. మత ప్రసక్తిలేని లౌకిక రాజ్యం మన భారతదేశం అంటూ దేశపు అస్తిత్వ స్వభావాన్ని రాజ్యాంగం కొనియాడుతోంది. ఆ పదాలు గొప్ప పదాలు. ఆ పదాల అర్థాలకు తూట్లు పొడిచే నాయకులు, అటు శాస్త్రానికి, ఇటు చట్టానికి పరోక్షంగా హాని చేస్తున్నారు.
Authorization