స్మార్ట్ ఫోన్... అందరి జీవితాల్లో ఓ ప్రధాన భాగమైపోయింది. ఫలితంగా రేడియేషన్ ప్రభావం కూడా పెరిగిపోయింది. దాంతో అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. దీని నుండి బయటపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటిని అనుసరిస్తే మనతో పాటు మన చుట్టూ ఉండే వారిని కూడా మన ఫోన్ వెదజల్లే రేడియేషన్ బారి నుండి రక్షించవచ్చు. ఈ కింది మార్గాలను పాటిస్తే కొంత వరకు అది సాధ్యమవుతుంది. అవేంటో చూద్దాం...
ఫోన్ లేకుండా ఒక్కరోజైనా గడపగలమా..? ఊహించడానికే చాలా కష్టంగా అనిపిస్తోంది కదూ..! అవును మరి మనం అంతగా ఫోన్లకు అలవాటుపడిపోయాం. ప్రస్తుతం అతి తక్కువ ధరలకే ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. దాంతో ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. అయితే ఇది కొంత వరకు మంచి విషయమే. ఎందుకంటే మనం ఎంత దూరంలో ఉన్నా మన వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవచ్చు. అంతే కాకుండా గతంలో కంప్యూటర్ ద్వారా మాత్రమే చేసుకునే ఎన్నో పనులు ఇప్పుడు ఫోన్లతోనే చేసుకోగలుగుతున్నాం. స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత మన పని మరింత సులువైపోయింది. దీనివల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతున్నాయి. ఈ విధంగా అత్యవసర సమయాల్లో ఈ ఫోను ఎన్నో రకాలుగా మనకు సహాయపడుతుంది. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల ప్రయోజనాలు ఎన్నున్నాయో నష్టాలు కూడా అంతే వున్నాయి.
విపరీతమైన ఫోన్ల వాడకం వల్ల హానికలిగించే రేడియషన్ ప్రభావం మనకు పొంచి ఉంటుంది. అలాగే, ఈ మధ్య కాలంలో వచ్చే కొన్ని స్మార్ట్ ఫోన్లు అత్యధికమైన రేడియేషన్ ప్రభావాన్ని వెదజల్లుతునట్లు కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడలేకపోయినా ఫోన్ల వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాని వల్ల వచ్చే రేడియేషన్ ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.
అతిని తగ్గించండి
అతిగా ఫోన్ వాడకం మీకు ఎన్నో నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దీని వలన కేవలం రేడియేషన్ ప్రమాదమే కాకుండా వత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి మరెన్నో ఆరోగ్య సమస్యలకు ఇది కారణమవుతుందని U.Sకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) వారు చెబుతున్నారు. కాబట్టి మీకు అవసరంలేని సమయంలో వీలైనంత వరకు ఫోనుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
ఇయర్ ఫోన్స్‌తో...
ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా స్మార్ట్ ఫోన్లే వాడుతున్నాం. కాబట్టి ప్రతి దానికి ఫోన్ చేయడానికి బదులుగా వీలైనంత వరకు మెసేజ్‌లు పంపడం మంచిది. తప్పకుండా ఫోన్ చేయాల్సివచ్చినపుడు బ్లూటూత్, హెడ్ సెట్ లేదా ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల చాలా వరకు రేడియేషన్ నుండి తప్పించుకోవచ్చు. ఎలాగంటే ఫోన్ మాట్లాడేటప్పుడు ఫోన్లో వుండే యాంటెన్నా మన మెదడుకు దగ్గరగా ఉంటుంది. దాంతో అది నేరుగా మన మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుంది. పైన తెలిపిన ప్రత్యామ్నాయాల వలన ఫోన్ మన తలకు దూరంగా ఉంటుంది. దాంతో చాలా వరకు రేడియేషన్ నుండి తప్పించుకోవచ్చు.
రాత్రి పూట ఆఫ్ చేయండి
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ తమ ఫోన్లను అలారం గడియారంలా వాడుతున్నారు. ఇది చాలా చిన్న విషయం కదా అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మీరు అలారం పెట్టి ఫోన్ మీ తల దగ్గర పెట్టి పడుకుంటారు. అప్పుడు అత్యధికమైన రేడియేషన్ బారిన పడతారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఫోన్ ఏరోప్లేన్ మోడ్‌లో వున్నా సరే దానిలోని యాంటెన్నా, బ్యాటరీ రేడియేషన్ ఇస్తాయి. కాబట్టి రాత్రిపూట ఫోన్ ఆఫ్ చెయ్యడమే సరైన పరిష్కారం.
సిగల్ వీక్‌గా ఉంటే..
ఫోన్లో సిగల్ వీక్‌గా ఉన్నప్పుడు వీలయినంత వరకూ ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే సిగల్ వీక్ గా ఉన్నపుడూ మన ఫోన్లోనీ యాంటెన్నా సిగల్ కోసం అత్యధికంగా తరంగాలను విడుదల చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి.
అంటిపెట్టుకోవద్దు
ఫోన్ జేబులోనో, పౌచ్లోనో ఎప్పుడూ మీతోనే అంటిపెట్టుకుని ఉంచుకోవడాన్ని తగ్గించండి. ఇలా మీతో పాటుగా ఎల్లప్పుడు ఫోన్ పెట్టుకోవడం వల్ల మీకు రేడియేషన్ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఫోనుతో పనిలేనప్పుడు దానికి కొంత దూరంగా ఉండేలా చూసుకోండి.
పైన చెప్పిన పద్ధతులను పాటించడం వలన, రేడియేషన్ పూర్తిగా నివారించ లేకపోయినా చాలా వరకు తగ్గించవచ్చు. ఎంత దూరంలో ఉన్నా సరే మన వారికీ మనం ఎల్లప్పుడూ దగ్గరగా ఉండేలా చేసే టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్నందుకు మనం ఆనందించవచ్చు. కానీ అతి వాడడం వలన కలిగే ముప్పుకు మనమే కారణం అవుతాం.
Authorization