వర్చువల్ కీ బోర్డు.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. కానీ ఉపయోగించం అంతే.. ఎందుకు అంటే.. అది మనకెందుకు? కీ బోర్డు టైపింగ్ రాని వాళ్ళ కోసమేమో? అని అనుకుంటాం.. కానీ వర్చువల్ కీ బోర్డు ఉపయోగించడం వల్ల హ్యాకర్ల బారి నుంచి మన అకౌంట్స్‌ను కాపాడుకోవచ్చని చాలా మందికి తెలియదు. వర్చువల్ కీ బోర్డు ఉపయోగించకపోతే హ్యాకర్లు మన అకౌంట్‌ను హ్యాక్ చేస్తారా అంటే.. ఏమో చెప్పలేం.. ఆ అవకాశం మాత్రం ఉంది. అది ఎలా అంటే.. సాధారణంగా మనం మన అకౌంట్స్‌ను మొబైల్ గాని, పర్సనల్ కంప్యూటర్ లేదా ల్యాప్‌ట్యాప్‌లో గాని ఉపయోగిస్తుంటాం. కానీ కొన్ని సందర్భాలలో వేరే ప్రదేశాలకు వెళ్ళినపుడు లేదంటే అత్యవసర సమయంలో ఇంటర్నెట్ కేఫ్‌లలో అకౌంట్లను వాడుతుంటాం. అలాంటి సందర్భంలో అకౌంట్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.
బ్యాంకు వెబ్సైట్లలో ఎక్కువగా..
ఏ బ్యాంకుకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసినా, లాగిన్ ఐడీ, పాస్వర్డ్ పక్కన వర్చువల్ కీ బోర్డు అని ఉంటుంది. చాలా ఇంటర్నెట్ కేఫ్‌లలో హ్యాకర్లు, దొంగలు కీలాగర్ (Keylogger) అనే సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తారు. దీని పని ఏంటంటే, మనం కీ బోర్డుపై ఏయే కీలను ప్రెస్ చేస్తున్నామో రికార్డు చేస్తుంది. దాని వల్ల మనం ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాక మనం ఏయే వెబ్సైట్లలో లాగిన్ అయ్యామో సులువుగా తెలుసుకోగలరు. తద్వారా బ్యాంకుల వెబ్సైట్లలో మనం ఏ కీలను ఉపయోగిం చామో, అవే కీల సాయంతో మన అకౌంట్లోకి సులువుగా లాగిన్ అవ్వగలరు. వేరే వాళ్ళు మన అకౌంట్లోకి లాగిన్ అయితే ఏర్పడే ముప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.. ఇలాంటి సాఫ్ట్వేర్ నుంచి మనం తప్పించుకోవాలంటే కచ్చితంగా వర్చువల్ కీ బోర్డును ఉపయోగించాలి. ఆ కీ బోర్డు సాయంతో ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే అవి రికార్డ్ అవ్వవు. మనం హ్యాకర్ నుంచి తప్పించుకోగలం. అందువల్ల ఎప్పుడైనా, ఎక్కడైనా బయటి ప్రాంతాలలో మన బ్యాంక్ అకౌంట్‌కు లాగిన్ అవ్వాలనుకుంటే వర్చువల్ కీబోర్డునే వాడడం మంచిది.
Authorization