ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది సార్ట్‌ఫోన్.. వ్యక్తిగత అవసరాలే కాదు.. ఇంట్లోని చాలా అవసరాల కోసం ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు బ్యాంక్ లావాదేవీలు, షాపింగ్, బిల్ పేమెంట్స్, సర్టిఫికెట్స్ స్టోరేజి ఇలా.. ప్రతి దానికి స్మార్ట్ ఫోన్‌పైనే ఆధారపడిపోతున్నాం. ఎన్నో రకాల సేవలు ఎక్కడికీ వెళ్ళాల్సిన పనిలేకుండా ఫోన్ ద్వారా జరిగిపోతుండడంతో చాలా మంది స్మార్ట్‌ఫోన్‌నే వినియోగిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పనులు ఎంత సులువుగా చేసుకోవచ్చొ, ఇబ్బందులు కూడా అదే రీతిలో ఉన్నాయి. ఫోన్ పోతే ఏం చేయాలో చూద్దాం..
ఎక్కడికైనా వెళ్ళినపుడో, ఏదైనా హడావుడిలో ఉన్నపుడో ఫోన్ మిస్ అవుతుంటుంది. ఒకసారి చేతి నుంచి ఫోన్ మిస్ అయిందంటే ఏదో కోల్పోయినట్టే. దొరికితే పర్వాలేదు. ఒక వేళ దొరకకపోతే అందులో ఉన్న డేటా, ఫైళ్ళు, వ్యక్తిగత సమాచారం అంతా పోయినట్టే. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎప్పటికి దొరుకుతుందో చెప్పడం కష్టం. పోలీసులు ఎక్కువగా ట్రేస్ చేసేది ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా.. సాధారణ దొంగలైతే ఐఎంఈఐ నెంబర్ ద్వారా పట్టుకునే వీలుంటుంది. ఏదైనా ముఠా చేతికి చిక్కితే.. ఐఎంఈఐ నెంబర్ మార్చేసి సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో ఫోన్‌ను ట్రేస్ చేయడం కష్టమే. అయితే టెలికాం శాఖ ఈ పద్ధతికి అడ్డుకట్టవేసి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అందుకోసం సెంట్రల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) ఏర్పాటు చేయాలని చూస్తోంది. దీనిలో ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిటీస్(IMEIs) ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ క్లోనింగ్, చోరీల సమస్య మన దేశంలో ఎక్కువగానే ఉంది. ఐఎంఈఐ నెంబర్లు మార్చి ఫోన్లు అమ్మడం అనేది ఒక చీకటి వ్యాపారంగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు 2017లో టెలికాం శాఖ సెంట్రల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. మొదటి సారి ప్రయోగాత్మకంగా ఈ వ్యవస్థను మహారాష్ట్రలోని పూణెలో ప్రారంభించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు కేంద్రం 2019-20 మధ్యంతర బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించింది. ట్రారు సమాచారం ప్రకారం 2019 మార్చి నాటికి భారతదేశంలో 1.16 బిలియన్ మంది వైర్లెస్ వినియోగదారులుగా ఉన్నట్టు అంచనా.
ఎలా బ్లాక్ చేయొచ్చు..
సాధారణంగా ఐఎంఈఐ నెంబర్ అంటే ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఉండే ఒక యూనిక్ నెంబర్. దీని ద్వారా ఫోన్‌ను ట్రాక్ చేయడంతో పాటు ఫోన్ పోయిన సమయంలో డేటా దుర్వినియోగం కాకుండా కూడా అడ్డుకునే వీలుంటుంది. దీని స్థానంలో సెంట్రల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏర్పాటైతే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఫోన్ పోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా టెలికాం శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే ఫోన్‌కు సంబంధించిన నెంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. అలా చేస్తే ఆ ఫోన్‌తో ఏ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేయడం సాధ్యం కాదు.
Authorization