ప్రశ్న : ఈ మధ్య వాట్సాప్‌లో ఆధునిక విద్యుత్ సరఫరా టవర్లకు, దేవాలయాల్లోని ధ్వజ స్తంభాలకు లింకు పెట్టడం, ఆలయాల్లో వేద మంత్రాల ఉచ్ఛారణకు, విద్యుదయస్కాంత తరంగాలకు సంధి చేస్తూ వీడియో చక్కర్లు కొడుతోంది. ఇదెంత వరకు నిజం?
జవాబు : ఏదేని నిర్మాణపు పైభాగం అర్ధగోళాకారం (down shape) లేదా విలోమ పారాబోలా (inverted parabola) ఆకారంలో ఉంటే, దాని మీద పడ్డ వర్షం, లేదా దుమ్ము త్వరగా చెదరిపోతుంది. అలాగే అలాంటి నిర్మాణాలు రాకెట్టు పైభాగంలోను, విమానాల ముందు భాగంలోను ఉంటే గాలి రాపిడిని (aerial friction) గాలి అవవరోధాన్ని (aerial resistance)అధిగమించి త్వరితంగా ముందుకు వెళ్లగలుగుతుంది. పూరిళ్లు, పెంకుటిళ్లు, కొన్ని భవనాలు, కాలువల మీద వంతెనలు ఇలాంటి నిర్మాణంలో ఉండడం చిరకాలంగా వస్తున్న ఆనవాయితీ. సాధారణ గణితం ద్వారాను, స్వాల్పిక భౌతిక శాస్త్ర సమస్థితి నియమాల (simple physics law of equilibrium) ద్వారాను ఇలాంటి నిర్మాణాల రూపాలను సులభంగా వివరించగలం. ఇలా రాకెట్ ముందు భాగంలో ఉన్న గోళాకతులకు, గుడి గోపురాల మీదున్న నిర్మాణాలకు సంధానం చేయడాన్ని కూడా ఆ వీడియోలో చూపారు. పైగా ధ్వజ స్తంభంతో పాటు, గుడి గోపురాల పైనున్న లోహ కలశాలు లోహంతోనే తయారు చేయడం వెనుక ఆలయ సంస్కతిని స్థాపించిన పండితులకు వేలాది సంవత్సరాల క్రితమే పిడుగు పాటు నుంచి దేవాలయాల్ని రక్షించే పిడుగుపాటు అవరోధ కడ్డీ (lightning rod) విధానం తెలుసన్నట్టుగా కూడా ఆ వీడియోలో ఉంది. ధ్వజస్తంభపు పైభాగాన పట్టీలుగా పక్కకు నిర్మించి వాటికి గుడి గంటలు తగిలించడానికి విద్యుత్ ఉత్పత్తి క్షేత్రాల నుండి అధిక మోతాదులో (33000 వోల్టులు మొ||) ఆల్టర్నేటింగ్ కరెంట్ (ఎసి) పద్ధతిలో సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ పవర్ స్తంభాలకు పోలిక పెట్టడం అంటే- ఖద్దరు బట్టలకు ఖాదర్బాషాకు లింకు పెట్టడమే. ఖాదర్‌భాషా మొదట కట్టిన బట్టనొకడు ఖద్దరు బట్ట అంటున్నారని మునుపటికెవడో లింకు పెట్టారు. ధ్వజ స్తంభానికి టవర్ లైన్లకు ఏమాత్రం శాస్త్రీయ సంధానం లేదు. దేని పని దానిదే. దేని ఆవశ్యకత దానిదే. అదే విధంగా మంత్రోచ్ఛారణల్లో విద్యుదయస్కాంత తరంగాలు నోటిలోంచి వెలువడుతాయనడం పూర్తిగా అశాస్త్రీయం, అసంబద్ధం. ధ్వని గాలిలో ప్రయాణించే అనుదైర్ఘ్య తరంగాల(longitudinal waves)కు సంబంధించిన విషయం. విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్ తరంగాల (transverse waves) సంబంధించిన కాంతి రూపం. ధ్వని విడిగా యానకం (medium) కావాలి అంటే పదార్థం (అణువులు, పరమాణువులు లేదా కణాలు) అవసరం. కానీ విద్యుదయస్కాంత తరంగాలకు యానకం అవసరం లేదు. మంత్రోచ్ఛారణ, వేద మంత్ర పఠనం వంటివి ధ్వని రూపాలు. అందులో కాంతి ఇసుమంత కూడా లేదు. నాలుక ఒక టార్చిలైటు కాదు. నోరు ఓ ఎల్ఇడి బల్బు కాదు. ధ్వనితరంగాలు ప్రయాణ దిశలోనే పాదార్థిక కణాలయిన అణువులు పరమాణువులు మొదలయిన శకలాల్ని సాంద్రీకరిస్తూ (ensification), విరళీకరిస్తూ (rarification), సరళ హరాత్మకంగా( harmonic) జరిగే డోలన రూప యాంత్రిక చలనాలు కానీ కాంతి ప్రయాణ మార్గానికి లంబదిశలో విద్యుక్షేత్ర బలాన్ని ఒక ఉపరితలం (plane) మీదుగా, ఆయస్కాంత క్షేత్రాన్ని ఆ ఉపరితలానికి మరో లంబోపరితలం మీదుగా హరాత్మకంగా (sinusoidally) మార్చే శక్తి పరంపర. అంటే ధ్వని తరంగాలు x- అక్షంలో ప్రయాణిస్తుంటే, అందులో కలిగే డోలన చలనాలు కూడా x- అక్షంలోనే సంభవిస్తాయి. కానీ విద్యుదయస్కాంత తరంగాల గమనం x- అక్షంలో ఉంటే విద్యుత్ క్షేత్ర హరాత్మక పరంపరXZ అక్షం మీదుగా XZ ఉపరితలంలో సంభవిస్తాయి. అదే విధంగా అయస్కాంత క్షేత్ర హరాత్మక పరంపర Y- అక్షం మీదుగాXY ఉపరితలంలో సంభవిస్తాయి.
కాబట్టి ఆ వాట్సాప్ వీడియోలో ఉన్న మతతత్వ రాజకీయ ప్రేరిత వాగాడాంబరంతో గుళ్లు గోపురాలు ఉండే నిర్మాణాలకు, పూజలు పునస్కారాలకు పడికట్టు సైన్సు పదాలతో సమర్థించుకోవడానికి యువతను ఛాందసం వైపు నెట్టడానికి చేసే కుయుక్తి తప్ప మరోటి కాదు.
Authorization