మొక్కలు మాట్లాడనే లేవు.. అలాంటిది సంగీతం చేస్తాయా.. ఇదేం వింత..!! అని అనుకోకండి.. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషుల ఆలోచనలకు పదును పెట్టేకొద్దీ ఇలాంటి వింతలు అనేకం వెలువడుతూనే ఉంటాయి. ముంబయికి చెందిన హార్టికల్చరిస్ట్కు తను నడిపే నర్సరీలో మొక్కలు ఒక దానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. అదే తడువుగా అందుకు సంబంధించిన ఒక మెషీన్‌తో ప్రయోగం చేశాడు. ఇంకా అందుకు సంబంధించి ఆయా ప్రాంతాలలో వాటి భావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది పర్యావరణ ప్రేమికులను ఆకర్షిస్తున్నాడు.
సాధారణంగా మొక్కలు గాలి వీచినపుడు ఆకులతో శబ్దాలు చేస్తాయి అని అందరికీ తెలిసిన విషయమే. కానీ అవి చేసేవి శబ్దాలా.. లేక వాటి భాషనా అని ఎక్కువ శాతం మంది లోతుగా ఆలోచించరు. అందరు ఆలోచించేది అసలు వాటికి భాషే లేదు కదా అని.. ఎలా మాట్లాడతాయి అనే అనుమానమూ వస్తుంది. కానీ ముంబయికి చెందిన వర్షికా నర్సరీని నడిపించే షాన్ లాల్వనీ అనే వ్యక్తి మాత్రం అలా వదిలేయలేదు. అతనో హార్టికల్చరిస్ట్.. మొక్కలు ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ అవుతాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో పోడ్కాస్ట్లో ఒక కాన్సెప్ట్‌ను చూసి ఉపయోగించాడు. అతను చేసిన ఈ పరిశోధన వల్ల కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా మొక్కలు ఒక దానితో ఒకటి కమ్యూనికేట్ అవుతాయట. అవి రసాయనికంగా, విద్యుత్ తరంగాల ద్వారా.. ఏవైనా ఆపద లేదా మరేదైనా సమస్యను తెలుపుకోవడానికి వాటికి ఇదే మార్గమని అతని పరిశోధనలో తెలిసింది.
ఈసీజీ యంత్రం విద్యుత్ తరంగాలను గ్రాఫ్‌గా మార్చినట్టుగానే మొక్కలకు అమర్చిన యంత్రం విద్యుత్ తరంగాలను సంగీత తరంగాలుగా మారుస్తుంది. ఆ యంత్రం పేరు మిడిమొలక. ఈ పరికరాన్ని ఫిలడెల్ఫియా బేస్డ్ ఆర్ట్స్ కలెక్టివ్ డేటా గార్డెన్ ఉత్పత్తి చేసింది. లాల్వానీతో పాటు అతని బృందం ఒక నెల రోజుల పాటు శబ్దాలకు సంబంధించి అనేక ప్రయోగాలు చేశారు. అందులో మొక్కలు ప్రతిస్పందించే ఉత్తేజకరమైన ఉద్దీపనలను వారు గమనించారు. అవి నీరు కారిపోయేటప్పుడు లేదా ఒక ఆకును విచ్ఛిన్నం చేస్తున్నపుడు ఒక రకమైన శబ్దం చేస్తున్నాయని గుర్తించారు.
ఈ పరిశోధన కోసం వారు మొదట గడ్డి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంటాయి కాబట్టి, అటువంటి వాటి మీద ఈ విధమైన పరిశోధన చేశారు. సీతాకోక చిలుకలు, పురుగులు వాటి మీద నుంచి ఎగురుతున్నపుడు వాటి గమనికలు మారుతున్నట్టు గమనించారు. ఈ పరిశోధన పూర్తవ్వగానే, వారి ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అసలు ఎలా ఉంటుందో చూడాలని వారాంతాల్లో నర్సరీకి రావచ్చని ప్రకటించారు. అంతేకాకుండా.. వచ్చే సందర్శకులు వారి వద్ద ఉన్న మొక్కలు ఏ విధమైన సంగీతాన్ని వ్యక్తపరుస్తాయో తెలుసుకునేందుకు తీసుకురావచ్చని ప్రకటించారు.
'ఒక మొక్క లోపలి పనితీరును చూడటం ఆనందించదగినదే. మొక్కల భావాలను తెలియజేయడానికి ఒక స్పష్టమైన మార్గం అయినప్పటికీ, ఇందుకు ఖర్చు కూడా బాగానే అయింది. మొక్కలు ఇంట్లో పెంచుకుంటే ఇల్లు అందంగా కనబడుతుందని డబ్బులు వెచ్చించి మరీ కొనుగోలు చేస్తారు. కానీ మొక్కలు అంతవరకే కాదు, అంతకంటే ఎక్కువ అని చూపించాలనుకున్నాం' అని లాల్వానీ తన భావాలను వెల్లడించాడు.
సాంకేతికత పరిజ్ఞానం అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను కలిగి ఉంటుంది. మొక్కలు గిటార్ లేదా డ్రమ్స్ వాయించగలవు. నర్సరీలోనే కాక ట్రాఫిక్, రవాణా చేసే సమయంలో, బయట ప్రపంచంలో మొక్కలు ఏ విధంగా స్పందిస్తాయో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధునాతన సాంకేతికత అందుబాటులో ఉండాలే కానీ ఏ విషయాన్నైనా పసిగట్టవచ్చని ఈ విషయం వెల్లడించింది.
Authorization