ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 2.5 బిలియన్ (250 కోట్ల ) మంది ఉపయోగిస్తున్నారు. బీటా పరీక్షలో ఉన్న ఆండ్రాయిడ్ క్యూ పేరు ఆండ్రాయిడ్ 10గా మారుస్తున్నట్టు గూగుల్ తన అధికారిక బ్లాగ్‌లో వెల్లడించింది. పదేళ్ల క్రితం విడుదలైన ఆండ్రాయిడ్ ఫోన్ వర్షెన్లన్నింటిలో అల్ఫాబెటికల్లో ఏదో ఒక అక్షరం ఉంటూ వచ్చింది. ఆ పేర్లలన్నింటినీ స్వీట్ డెజర్ట్‌లను గుర్తు చేసేలా ఒక్కో వర్షెన్కు ఒక్కో పేరును పెడుతూ వచ్చింది. ఇప్పటికీ పదేండ్లు పూర్తయిన సందర్భంగా ఈ సంప్రదాయాన్ని వదిలేయాలని గూగుల్ నిర్ణయించుకుంది. అంటే ఇకపై ఈ డెజర్ట్ కోడ్‌నేమ్‌లు ఉండవు. ఆండ్రాయిడ్ తదుపరి విడుదల చేసే వర్షెన్‌ను ఆండ్రాయిడ్ 10 అని పిలువనున్నారు. అంతేకాదు, ఆండ్రాయిడ్ ప్రారంభమై దశాబ్దం కావస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పేరును సూచించడం సముచితంగానే అనిపిస్తున్నట్టు బ్లాగ్‌లో గూగుల్ వెల్లడించింది. ఆ తర్వాత రానున్న ఆండ్రాయిడ్ 'ఆర్'ను 11 అని పిలుస్తారని, ఈ పేరు మార్పుకు గల కారణాలను బ్లాగ్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకు పెట్టిన పేర్లు చాలా మందికి అర్థం కావడం లేదనే అభిప్రాయం వెలువడినట్టు తెలిసిందని, అందువల్లే ఈ మార్పు జరుగుతున్నట్టు పేర్కొంది. అంతేకాదు గతంలో ఉన్న అక్షర క్రమంలో పేర్లు కొన్ని భాషలలో గందరగోళానికి గురవ్వడం కూడా ఇందులో ఒక భాగమని వెల్లడించింది. అంతేకాదు కొత్తగా వచ్చే వినియోగదారులకు ఇది కష్టమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అందువల్ల ఇకపై రానున్న వర్షెన్లలో ఆల్ఫాబెటికల్ అక్షరాలు లేకుండా కేవలం అంకెలు మాత్రమే ఉండనున్నట్టు స్పష్టం చేసింది.
మారిన లోగో రంగు
ఇప్పటివరకు ఆకుపచ్చ రంగులో చెలామణి అయిన గూగుల్ లోగో రంగును పున:రూపకల్పన చేశారు. ఫాంట్, పేరును కొద్దిగా పాత డ్రాయిడ్ మస్కట్ పేరుతో భిన్నమైన రంగులతో పునరుద్ధరించింది. అంటే లోగో ఇకపై ఆకు పచ్చతో పాటు నలుపు రంగుకు మారనుంది. వినియోగ దారులను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు చేస్తున్నట్టు, ముఖ్యంగా దృష్టి లోపం ఉన్న వారికి ఆకుపచ్చ చూసేందుకు కష్టంగా అనిపిస్తున్నట్టు ఫీడ్‌బ్యాక్‌లో తేలినట్టు బ్లాగ్‌లో పేర్కొన్నారు.
Authorization