ఫొటోలు, సెల్ఫీలంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. ఎక్కడికెళ్ళినా.. ఏం చేస్తున్నా.. ఓ సెల్ఫీ.. ఓ ఫొటో.. తప్పనిసరి. వాటిని భద్రపరుచుకోవడమే కాదు నలుగురితో షేర్ చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే కొందరు వినూత్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో ఒకటి ఫొటోలను కార్టూన్లుగా చేయడం.. అలా మన ఫొటోలతో మనమే కార్టూన్లు చేసి పోస్ట్ చేస్తే ఆ అనుభూతే వేరు కదా.. వీటిని ఎక్కువగా వాడుతున్నారు కూడానూ. అసలు ఫొటోలు కార్టూన్లుగా మార్చుకునేందుకు ఏం చేయాలి.. వాటిని ఎలా చేయాలి.. ఆ యాప్స్ ఏంటో.. తెలుసుకుందాం..
స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత ఫొటోలు, సెల్ఫీలు పెరిగిపోయాయి. ప్రతి రోజును అందంగా సేవ్ చేసుకోవడానికి స్మార్ట్‌ఫోన్ ఒక సాధనంగా మారింది. ఎక్కడికి వెళ్ళినా ఫొటోలు తీసుకోవడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, లైకులు షేర్లు చూసుకుని మురిసిపోవడం ఒక అలవాటుగా మారిపోయింది. అసలు ఫొటోలు బాగా రావాలంటే కావాల్సింది కెమెరా. ఆయా ఫొన్లను బట్టి కెమెరా పనితీరు ఉంటుంది. కెమెరాల పనితీరు బాగా ఉంచేందుకు కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. వీటిల్లోని ఫిల్టర్ల ద్వారా ఫొటోలను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఆ ఫొటోలను కార్టూన్లుగానూ మార్చేందుకు యాప్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి కార్టూన్ స్కెచ్, కార్టూన్ ఫేస్-సెల్ఫీ ఫొటో ఎడిట్, అర్టిస్టా కార్టూన్ అండ్ స్కెచ్ కామ్, మూవ్మెంట్ కామ్ కార్టూన్స్ అండ్ స్టిక్కర్స్, కార్టూన్ ఆర్ట్ పిక్స్ అండ్ ఫొటో ఎడిటర్, ఫాటిఫై. వాటిని వేటివేటికి ఉపయోగిస్తారో చూద్దాం.
ఫాటిఫై : ఈ యాప్‌తో ఫొటోలను కార్టూన్లా కనిపించేటట్లు చేయవచ్చు. అంతేకాకుండా ఫొటోలో ముఖాన్ని లావుగా కనిపించేలా ఎడిట్ చేయవచ్చు. శరీరాన్ని సైతం లావుగా కనిపించేలా ఇందులో ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
పోర్ట్రా : ఫొటోలకు కొంచెం క్వాలిటీ లుక్ ఉండడానికి ఫ్రిస్మా వంటి ఫేస్ యాప్ వాడుతున్నారు. అదే తరహాలో పోర్ట్రా యాప్ చేరింది. ఫొటోలకు వాటర్ కలర్స్, స్కెచెస్‌ను సరిగా యాడ్ చేయడం ఈ యాప్ ప్రత్యేకత. ఒరిజినల్ ఫొటో క్వాలిటీని ఏ మాత్రం మార్పు చేయకుండా పోర్ట్రయిట్ ఇమేజ్‌లకు ఫిల్టర్లు యాడ్ చేయడానికి ఈ యాప్ బాగుంటుంది. అనేక రంగులను మిళితం చేస్తూ వాటర్ కలర్స్, స్కెచెస్, ఆయిల్ పెయింట్లలో వైబ్రెంట్ రంగులు వినియోగించేలా ఈ యాప్ అందుబాటు లో ఉంది. ఇది ఐఓఎస్, ఆండ్రాయిడ్లలో ఉపయో గించవచ్చు. ల్యాండ్ స్కేప్‌లో ఉన్న ఫొటోలను సైతం సులువుగా పోర్ట్రయిట్లోకి మార్చుకునే వెసులుబాటు ఉంది. 19 రకాల ఫిల్టర్ల వరకు అందుబాటులో ఉన్న ఈ యాప్ ఫొటోలకు కొత్తదనాన్ని తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది.
కార్టూన్ ఆర్ట్ పిక్స్ అండ్ ఫొటో ఎడిటర్ : దీనిని బెస్ట్ కార్టూన్ యాప్‌గా చెప్పవచ్చు. ఇందులోని ఎన్నో రకాల మోడ్రన్ ఫిల్టర్లతో కార్టూన్, పెయింటింగ్స్లోకి మార్చవచ్చు. ఆండ్రాయిడ్లలోనే ఈ యాప్ పని చేస్తుంది.
మూవ్మెంట్ కామ్ కార్టూన్స్ అండ్ స్టిక్కర్స్ : ఫన్నీ కార్టూన్లుగా మార్చుకోవాలంటే ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంచుకున్నాక కార్టూన్‌గా మార్చుకోవచ్చు. కొన్ని ఫన్నీ స్టిక్కర్లను సైతం ఫొటోలకు యాడ్ చేసుకునే వీలుంటుంది. మీసం, జట్టు, గడ్డాలు వంటి ఫన్నీ స్టిక్కర్లను తయారు చేయవచ్చు.
కార్టూన్ స్కెచ్ : ఈ యాప్‌లోని ఎఫెక్ట్‌లతో క్రియేటివిటీతో ఫొటోలను కార్టూన్లుగా మార్చుకోవచ్చు. ఫొటో అందంగా, ప్రకాశవంతంగా కనిపించేలా ఎడిట్ చేసుకోవచ్చు. ఎమోజీలతో ఫన్నీగా కూడా తయారు చేసుకోవచ్చు. టెక్ట్స్ రాసేందుకు సైతం ఈ యాప్‌లో ఆప్షన్లు ఉపయోగపడతాయి. స్కెచ్‌లా మార్చుకునేందుకు కూడా ఈ యాప్‌లో అవకాశం ఉంది.
కార్టూన్ ఫేస్-సెల్ఫీ ఫొటో ఎడిట్ : ఈ యాప్ ద్వారా కార్టూన్ క్యారెక్టర్లను క్రియేట్ చేసుకునేందుకు ఉపయోగించే ఫిల్టర్లలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. ఎఫెక్ట్ లిస్ట్, బ్యూటీ ఫిల్టర్స్, బ్యాక్‌గ్రౌండ్ వంటి ఫిల్టర్లు ఈ యాప్‌లో ఉన్నాయి.
ఫ్లవర్ కెమెరా : ఆండ్రాయిడ్ డివైజ్‌లో మాత్రమే వాడగలిగే ఈ యాప్ ద్వారా అనేక రకాల స్టిక్కర్లు ఫిల్టర్లు ఉన్నాయి. సాధారణ ఫొటోలు, సెల్ఫీలకు ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఫొటో లైటింగ్ ఎఫెక్ట్‌ను సైతం మార్చుకోవచ్చు.
కార్టూన్ ఫొటో ఎడిటర్ : ఫొటోలను కార్టూన్లుగా మార్చడానికి బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్‌గా దీనిని చెప్పవచ్చు. స్కెచ్‌లు, ఆయిల్ పెయింటింగ్‌లు, పెన్సిల్ డ్రాయింగ్, కార్టూన్లు ఇలా ఎన్నో విధాలుగా మార్చుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా ఉంది. వీటితో పాటు ఇంకా అనేక రకాల యాప్‌లు అందుబాటులో ఉంటున్నాయి. వాటి ద్వారా కావాల్సిన విధంగా స్టిక్కర్లను, పెయింగ్లను, పెన్సిల్ స్కెచ్లను తయారు చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు.
Authorization