Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ : బలగం సినిమాలో తన పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన బుడిగజంగాల కళాకారులైన వీరికి ఆరోగ్య కష్టాలు చుట్టుముట్టాయి. మొగిలయ్యకు రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో రెండేళ్లుగా ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఊరూరా తిరుగుతూ యక్షగానాలు, బుర్రకథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్న మొగిలయ్యకు ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేదు. ఈ విషయం తెలుసుకున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా సర్కారు స్పందించింది.
వారి ఆర్థిక పురోభివృద్ధికి ఉన్నతాధికారులతో మాట్లాడి దళిత బంధు పథకం కింద మొగిలయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్య శాలువాతో సత్కరించి దళిత బంధు మంజూరు పత్రాన్ని అందచేశారు. తమ ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని దళిత బంధు పథకం మంజూరు చేయించిన బోయినపల్లి వినోద్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డికి పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, ఎల్డీఎం రాజు తదితరులు పాల్గొన్నారు.