Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్ణాటక
కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి ఎంపికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటి వరకు అధిష్ఠానం ఎలా చెబితే అలాగేనన్న పార్టీ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్.. తాజాగా గొంతు పెంచుతున్నారు. బుధవారం ఉదయం డీకే శివకుమార్, సిద్దరామయ్యలతో పార్టీ చీఫ్ ఖర్గే భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం పదవి విషయంలో ఇద్దరి ముందు పలు ప్రతిపాదనలు చేశారు. పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోవడానికి ఎంతో కష్టపడ్డానని, ముఖ్యమంత్రి పదవిని వదులుకోలేనని స్పష్టం చేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేయకపోతే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం చేయాలని హైకమాండ్ కు సూచించారు. సిద్ధరామయ్యకు సీఎం పదవిని కట్టబెట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోనని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నర సంవత్సరాలు పంచుకుందామంటూ సిద్ధరామయ్య చేసిన ప్రతిపాదననూ డీకే తోసిపుచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనేది మాత్రం తేల్చుకోలేకపోతోంది. సీఎం పదవికి పోటీ పడుతున్న నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్యలలో ఎవరికి పదవి కట్టబెట్టాలనేది నిర్ణయించడం ఆ పార్టీ అధిష్ఠానానికి ఓ సవాల్ గా మారింది. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు డీకే, సిద్ధరామయ్యలను పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించుకుంది.
గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ప్రకటించినా.. బుధవారం మధ్యాహ్నానికి కూడా కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. ఈ విషయంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.