నిరంతరాయంగా పనిచేసే క్రమంలో కాలేయం వ్యాధి గ్రస్తమవు తుంది. కాలేయం పూర్తిగా పనికిరాని స్థితికి చేరితే మాత్రం అసలు సమస్య ఏర్పడుతుంది. కనీసం పది శాతం పని చేసినప్పటికీ పర్వాలేదు. 30 శాతం పనిచేయగలిగితే కాస్తంత కుదుట పడొచ్చు. పూర్తిగా కాలేయం చెడిపోతే మాత్రం శస్త్ర చికిత్స ద్వారా మార్చడం ఒక్కటే పరిష్కారం. దీన్నే కాలేయ మార్పిడి అంటారు. మెటాబాలిక్ కాలేయ వ్యాధి, హెపటైటిస్-బీ లేదా సీ, పిత్తాశయంలో పుట్టుకతోనే రంధ్రం మూసుకుని ఉండటం వంటి రుగ్మతలకు పరిష్కారానికి ఇదొక్కటే పరిష్కారం.
కాలేయం ఒక ప్రత్యేకమైన అంగం. అది తిరిగి పెరుగుతుంది. ఒక మధ్య వయసు కాలేయ పరిమాణం తగ్గించి దాన్ని చిన్న పిల్లలకు మార్చితే అది పిల్లలతోపాటు పెరుగుతుంది. ప్రత్యామ్నాయంగా కాలేయాన్ని విభజించి ఇద్దరు గ్రహీతలకు మార్పిడి చేయొచ్చు.
సేకరించేదెలా..?
రక్తం మాదిరిగానే కాలేయాన్ని కూడా వేరే ఒక వ్యక్తి నుంచి సేకరించాల్సి ఉంటుంది. కాలేయం ఇచ్చే వ్యక్తిని దాతగా, తీసుకునే వ్యక్తిని గ్రహీతగా వ్యవహరిస్తారు. కాలేయ మార్పిడి కోసం అవయవాల వారు లేదా వారి కుటుంబాలు సమ్మతి తెలిపిన తర్వాత మరణించిన దాతల నుంచి తీస్తారు. దురదృష్టవశాత్తు కాలేయ మార్పిడి కోసం వేచి ఉన్న వ్యక్తుల జాబితా పెరుగుతూ ఉంది. మరణించిన దాత అవయవాలు చాలినంతగా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో బతికి ఉన్న దాత నుంచి కాలేయ మార్పిడి చేయొచ్చు. కాలేయానికి శరీరంలో ఏ ఇతర అవయవానికి లేనటువంటి పునరుత్పత్తి లేదా పెరుగే సామర్థ్యం ఉంది కాబట్టి ఇది సాధ్యం. కాలేయం రెండు భాగాలు శస్త్రచికిత్స తర్వాత 4 నుంచి 8 వారాల వ్యవధిలో పునరుత్పత్తి చేసుకుంటాయి.
దాతకు ఉండాల్సిన అర్హతలు
దాత రక్తం గ్రూపు గ్రహీత రక్తం గ్రూపునకు అనుకూలంగా ఉండాలి. దాత మంచి శారీరక , మానసిక ఆరోగ్యంతో ఉండాలి. దాత 19-60 సంవత్సరాల మధ్య ఉండాలి.
అనర్హులు ఎవరు?
హెపటైటిస- బీ లేదా సీ కలిగి ఉన్నవారు. తరచుగా అధిక మద్యపానం చేసే వారు. మానసిక చికిత్స చేయించుకుంటున్నవారు. క్యాన్సర్ బారిన పడిన వారు.
మార్పిడి మూడు రకాలు
కాలేయ మార్పిడిలో సాధారణంగా మూడు రకాలు ఉంటాయి. మృత దాత కాలేయ మార్పిడి (డీసీజెడ్ డోనార్ లివర్ ట్రాన్సు ప్లాంటేషన్) అంటే... బ్రెయిన్ డెడ్ లేదా మృత్యువు అంచుల్లో ఉన్న వారి నుంచి కాలేయాన్ని సేకరించి ఇతరులకు దాన్ని అమర్చడమన్న మాట. హృదయ స్పందన లేని దాతలు (నాన్ హార్ట్ బీటింగ్ డోనార్స్) పూర్తిగా చనిపోయిన వ్యక్తుల నుంచి (గుండె, మెదడు, ఊపిరితిత్తులు వంటి ప్రధానాంగాలన్నీ నిర్జీవం అయిపోయిన స్థితి) కాలేయాన్ని సేకరిస్తారు. అలాంటప్పుడు చనిపోయిన వెంటనే దాదాపు 20 నిముషాల్లోపే అవయవాన్ని ఇతరులకు అందజేస్తారు. సన్నిహితుల నుంచి సేకరించడం (లివింగ్ రిలేటెడ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ) వంటి కేసుల్లో కుటుంబ సభ్యులు లేదా దగ్గర సన్నిహితుల నుంచి కాలేయాన్ని సేకరించి ఇతరులకు అందజేస్తారు.
దాత నుంచి కాలేయాన్ని సేకరించాక గ్రహీతలోకి అమర్చడం అన్నది నిపుణులైన వైద్యుల టీమ్ మాత్రమే చేయగలుగుతుంది. ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జన్, అనెస్థటిస్ట్, పెర్ఫ్యుషనిస్ట్, హెపటాలజిస్ట్ వంటి నిపుణులు ఇందులో పాలు పంచుకుంటారు. కాలేయ మార్పిడిలో వివిధ విభాగాల మధ్య సమన్వయం చాలా అవసరం. అదే సమయంలో సదరు ఆస్పత్రిలో అన్ని హంగులు ఉన్న ఆపరేషన్ థియేటర్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, బ్లడ్‌బ్యాంక్, సపోర్టివ్ ల్యాబ్‌లు ఉండాలి. సుశిక్షితులైన సిబ్బంది కూడా ఉండాలి. ఇవన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే.. కాలేయ మార్పిడి అనేది ఖరీదైన అంశంగా గుర్తించాలి. కానీ, మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌లో మాత్రం చౌకదనే చెప్పొచ్చు.
సులువైనదేం కాదు...
కాలేయ మార్పిడి సులవైన ప్రక్రియ కాదు. అతి జాగ్రత్తలో నిర్వహించాల్సి ఉంటుంది. దానం చేసే వారికి, స్వీకరించే వారికి దీని గురించి పూర్తిగా వివరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రక్త పరీక్షలు చేస్తారు. కాలేయం నుంచి వచ్చే స్రావాలు, బైలిరుబిన్, అల్బుమిన్, ప్రోత్రాంబిస్, త్రాబో ప్లాస్టిన్ తదితర అంశాల్ని పరీక్షిస్తారు. బ్లడ్ గ్రూప్, వైరల్ స్టడీస్‌ను కూడా పరీక్షిస్తారు. కడుపు ప్రాంతంలో అల్ట్రాసౌండ్ పరీక్షతోపాటు అవసరానికి అనుగు ణంగా బయోప్సీ తీసి పరీక్ష చేస్తారు.. రక్తం సరఫరాను పరిశీలించటంతోపాటు ఎకో కార్డియో గ్రామ్ వంటి పరీక్షల ద్వారా గుండె స్పందనను పరిశీలిస్తారు. అన్ని రకాల పరీక్షలు చేశాకే కాలేయ మార్పిడికి సిద్ధం చేస్తారు.
కాలేయ మార్పిడికి సుమారు 8-12 గంటల సమయం పడుతుంది. కడుపు భాగంలో ఒక చిన్న రంధ్రం పెట్టి ఈ ఆపరేషను మొదలు పెడతారు. ఆధునిక వైద్య శాస్త్రంలో లాపరోస్కోపిక్ చికిత్స చాలా అద్భుత ఫలితం అని చెప్పొచ్చు. కడుపును కోయాల్సిన పని లేకుండా చిన్న గాటు ద్వారా చికిత్సను పూర్తి చేయటానికి వీలవుతుంది. దీని ద్వారా ఒక వీడియో కెమెరాను శరీరంలోకి పంపించి అక్కడి దృశ్యాలను తెర మీద చూస్తుంటారు. దీని ఆధారంగా చికిత్స చేయాల్సిన శరీర భాగాన్ని గమనించి అక్కడ చికిత్స పూర్తి చేస్తారు.
అతి జాగ్రత్తతో కూడిన ప్రక్రియ
కాలేయ మార్పిడి ఆపరేషన్ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ముందుగా శరీరంలో ద్రవాల కదలికలను పరిశీలిస్తారు. ఇందు కోసం కొన్ని ట్యూబులను శరీరంలోకి ప్రవేశ పెడతారు. విభిన్న స్రావాల ద్వారా ఆపరేషన్‌కు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా కాలేయం నుంచి విడుదలయ్యే పైత్యరసం అడ్డు పడకుండా చూసుకుంటారు. ఆ తర్వాత ఆపరేషన్‌కు ఉపక్రమిస్తారు.
అవసరమైనంత మేర మాత్రమే గాయం చేస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా తొలగించాల్సిన కాలేయాన్ని గుర్తించి అక్కడ ఎంత వరకు శరీర భాగం వేరు చేయాలో నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత ఆ శరీర భాగానికి సంబంధించిన పైత్యరస వాహికలు, రక్త కేశ నాళికల్ని జాగ్రత్తగా తప్పిస్తారు. మరో వైపు దాత శరీరంలో కాలేయ ప్రాంతాన్ని గుర్తించి కొంత భాగాన్ని సేకరిస్తారు. ఈలోగా గ్రహీత శరీర భాగంలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఉంచుతారు. ఆ తర్వాత జాగ్రత్తగా ఈ కొత్త భాగాన్ని అక్కడకు చేర్చి అతికిస్తారు. ఎంతో సంక్లిష్టమైన ఈ ప్రక్రియను నిపుణులైన సర్జన్లు మాత్రమే చేయగలుగుతారు. ఆధునిక వైద్య శాస్త్రంపై అవగాహన ఉన్నప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించి అవయవ మార్పిడిని సజావుగా పూర్తి చేసేందుకు వీలవుతుంది.
కాలేయాన్ని గ్రహీత శరీరంలో అమర్చాక అది అక్కడ నెమ్మదిగా ఇమిడిపోతుంది. ఇతర అవయవాల నుంచి సహాయం తీసుకుని కుదురుకుంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా తన విధులు నిర్వర్తించడం ప్రారంభిస్తుంది. ఇందుకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుంది.
Authorization