క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మొనరీ డిసీజ్ (సీఓపీడీ).. దీర్ఘకాలిక వ్యాధి. ఊపిరితిత్తులకు వచ్చే రుగ్మత ఇది. క్రమేణా ముదిరి తీవ్రంగా ఇబ్బంది పెట్టే మహమ్మారి ఇది. 'క్రానిక్ బ్రాకైటిస్' (దీర్ఘకాలిక శ్వాసకోశ వాపు), 'ఎంఫెసేమా' (సంధివాపు)కు దారి తీస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఏర్పడుతుంది. దగ్గూ వస్తుంది. క్రానిక్ బ్రాంకైటిస్ బారిన పడ్డవారికి గాలి గొట్టాలు (ఎయిర్ వేస్) కుంచించిపోతాయి.
ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకెళ్లే గొట్టాలు శాఖలుగా చీలిపోయి ఉంటాయి. ఇవి కుంచించి, దెబ్బ తినడం వల్ల అదనంగా శ్లేష్మం(మ్యూకస్)ను ఉత్పత్తి అవుతుంది. ఇది గాలి గొట్టాలకు అడ్డు తగలడం వల్ల తరచూ దగ్గు వస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఎంఫెసేమా ఉన్న వారికి గాలి గొట్టాలు తక్కువ సామర్థ్యంతో పనిచేస్తాయి.
కారణం?
సీఓపీడీ రావడానికి ధూమపానం, వాయు కాలుష్యం ముఖ్య కారణాలు. రెండింటి లో ధూమపానం ప్రధానమైనది. దీని వల్ల గాలి గొట్టాలు దెబ్బతింటాయి. సెకండ్‌హ్యాండ్ స్మోక్ (ఎస్హెచ్ఎస్) లేదా పాసివ్ స్మోక్ కూడా సీఓపీడీకి కారణాలు. జన్యుపరంగా సీఓపీడీ వచ్చే అవకాశం తక్కువే. ఎంజైమ్ లోపం వల్ల సీఓపీడీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. అల్ఫా-1 యాంటీ ట్రిప్సిన్ లోపం కూడా సీఓపీడీకి దారి తీస్తుంది.
లక్షణాలు
ప్రారంభ దశలో సీఓపీడీ లక్షణాలు ఏ మాత్రం కనిపించవు. రానురాను దగ్గు లేదా తెమడ తీవ్రమవుతుంది. కఫం ఎక్కువ తయారవుతుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. శ్వాస తీసుకునే సమయంలో పిల్లికూతలు వినిపిస్తాయి.
నిర్ధారణ ఎలా?
సీఓపీడీ నిర్ధారణకు 'స్పిరోమెట్రీ' పరీక్ష చేయాల్సి ఉంటుంది. అంటే.. ఉపరితిత్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడమన్నమాట. ఈ పరీక్షను అతి సులువుగా చేయించుకోవచ్చు. ఎలాంటి కోతలు ఉండవు. ఒక పరికరణాన్ని ఉపయోగించి చేస్తారు. ఆ సమయంలో గట్టిగా ఉపిరి తీసుకుని వదిలేయాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల నుంచి ఎంత గట్టిగా శ్వాస వదులుతున్నారో స్పిరోమెట్రీ యంత్రం తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో చెస్ట్ రేడియోగ్రాఫ్ లేదా సిటీ స్కాన్ ద్వారా ఊపిరితిత్తుల్లో వచ్చే మార్పులను తెలుసుకోవచ్చు.
చికిత్స
సీఓపీడీని అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ అయ్యాక ధూమపానాన్ని పూర్తిగా మానేయాలి. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ జాప్యం గానీ, నిర్లక్ష్యంగా గానీ చేయొద్దు. నోటి మాత్రలు లేదా ఇన్హెల్లర్స్ వాడటం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతూ వస్తుంది. ఇన్హెల్లర్స్ని ఒకట్రేండు సార్లు ఉపయోగించడంతో గాలి గొట్టాలు తెరుచుకుంటాయి. తద్వారా ఉపశమనం కలుగుతుంది. రోజూ ఇన్హెల్లర్స్ వాడటం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంటే ఆక్సిజన్ ఇన్హేలేషన్ అవసరమవుతుంది.
'పల్మొనరీ రిహాబిలిటేషన్'తో తీవ్రతను తగ్గించొచ్చు. వ్యాయామం ద్వారా కూడా వ్యాధి తీవ్రత తగ్గుతుంది.
ఎలాంటి జాగ్రత్తలు ఇలా..
వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో తెమడ పలుచగా మారుతుంది. తద్వారా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. స్మోకింగ్, దుమ్మూ దూళికి దూరంగా ఉండాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కాయగూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండాలి.
Authorization