ఆధునిక యుగం వైపు పరుగులు తీస్తున్నామని సంబుర పడుతున్న సమయంలో మారుతున్న జీవనశైలిలో భాగంగా వస్తున్న అనారోగ్య సమస్య అధికబరువు. అందుకే 21వ శతాబ్దపు అతిపెద్ద సమస్యగా అధికబరువు సమస్యలను గుర్తించారు. అనేక వ్యాధులు దాడి చేయడానికి స్థూలకాయం ముఖ్యమైన కారణం. అంతేకాదు భారీ కాయం వల్ల వచ్చే జబ్బులు మరణాలకు రెండవ ప్రధాన కారణం. అభివద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమస్య పోషకాహార లేమికి నిదర్శనంగా కనిపిస్తుంది. అభివద్ధి చెందిన దేశాలలో సుమారు 40 శాతం మంది పెద్దవారు, 20 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వస్తువులు, విలాస వసతులు శారీరక వ్యాయామాన్ని తగ్గించి శరీరబరువును పెంచుతున్నాయి. మరి ఈ సమస్యను నియంత్రించడంతో పాటు నివారించడం ఎలాగో తెలుసుకుంటే భవిష్యత్‌లో అధికబరువు సమస్య నుంచి బయటపడవచ్చు.
మన దేశంలో పట్టణాల్లో ఉన్నత, మధ్య తరగతి మహిళల్లో 30-50 శాతం మంది.. పురుషుల్లో 32 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని ఇటీవల జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నివారించదగిన 10 ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం కూడా ఒకటి.
అధిక బరువు అనేది ఏ కారణాలతో వచ్చినా అసహజ రీతిలో కండరాలు పెరగడం, ద్రవాలు నిలిచిపోవడం వల్ల కూడా రావచ్చు. కొవ్వు కణాలు విస్తరించినా, కొవ్వుగల కణజాలం అసహజంగా పెరిగినా, వాటి సంఖ్య రెట్టింపు అయినా స్థూలకాయం వస్తుంది. ఒక వ్యక్తి వయసు, ఎత్తుకు తగ్గట్టుగా ఎంత బరువు ఉండాలి అనేది 'బాడీ మాస్ ఇండెక్స్' (బిఎంఐ) ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా మగవారిలో 30 కన్నా మహిళల్లో 28.6 కన్నా బాడీ మాస్ ఇండెక్స్ అధికంగా ఉంటే వారు అధిక బరువు ఉన్నారని తెలుసుకోవచ్చు.
బాడీ మాస్ ఇండెక్స్(బిఎంఐ) చార్టు
అధిక బరువును నిర్ధారించేందుకు ఉపయోగించే గణనే బాడీ మాస్ ఇండెక్స్ గా పిలుస్తారు. ఒక వ్యక్తి బరువు(కేజీలు)ను, ఎత్తు(మీటర్లు)ను తీసుకోవాలి. ఎత్తును మీటర్లలో తీసుకుని.. అదే సంఖ్యతో మళ్ళీ గుణించాలి. వచ్చిన సంఖ్యతో ఆ వ్యక్తి బరువును భాగిస్తే.. వచ్చే సంఖ్యను బాడీ మాస్ ఇండెక్స్(బిఎంఐ)గా గుర్తించాలి. వచ్చిన సంఖ్య 18.5 లోపు ఉంటే వారు ఉండాల్సిన బరువు కన్నా తక్కువ బరువు ఉన్నారని గుర్తించాలి.
1. తక్కువ బరువు - 18.5
2. సాధారణ బరువు - 18.5 నుంచి 24.9 వరకు
3. అధిక బరువు - 25.0
4. ప్రీ- ఒబేస్ - 25 నుంచి 29.9వరకు
5. ఒబేస్ క్లాస్ (1) - 30.0 నుంచి 34.9 వరకు
6. ఒబేస్ క్లాస్ (2)- 35.0 నుంచి 39.9వరకు
7. ఒబేస్ క్లాస్ (3)- 40.0
స్థూలకాయం - కారణాలు
అధిక బరువు పెరగడానికి నిర్ధిష్టమైన కారణాలను చెప్పడం సాధ్యం కాదు. అనేక కారణాలతో బరువు పెరుగుతారు. వైద్యనిపుణులు చెప్పే సాధారణ కారణాలు హెరిడిటీ, వయసు. వయసుతో పాటు స్థూలకాయం వచ్చే అవకాశాలూ కూడా కొందరిలో పెరుగుతాయి. మగవారు 29-34 ఏండ్ల మధ్య , మహిళలు 35-49 ఏండ్ల మధ్య బరువు పెరుగుతారని కొన్ని పరిశోధనల్లో స్పష్టమైంది. హెరిడిటీ, వయసు కాకుండా మరి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు ముఖ్యంగా చెప్పవచ్చు.
స్థూలకాయం రావడానికి ఎన్ని కారణాలున్నాయో దీనిని నివారించడానికి అనేక మార్గాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక వ్యాయామం.
జీవనశైలిలో మార్పులు..
రోజువారి జీవితంలో చిన్నచిన్న మార్పులు చేయడం ద్వారా ఇప్పటికే స్థూలకాయం సమస్యతో బాధపడుతుంటే ఇతర వ్యాధులు రాకుండా నియంత్రించవచ్చు, భవిష్యత్‌లో వచ్చే అధిక బరువు సమస్యను నివారించవచ్చు.
- ఎక్కువ సమయం నిద్ర పోవడం శరీరాన్ని అచేతనంగా చేస్తుంది. యాక్టీవిటీ తగ్గి బద్దకం పెరుగుతుంది. దీన్ని నివారించాలంటే ఎక్కువ గంటలు నిద్రపోకూడదు.
- తక్కువ దూరానికి వాహనాలు ఉపయోగించడం మానేయాలి.
ఆహారంలో మార్పులు..
- పొద్దున్నే గోరువెచ్చని నీరు తాగాలి. రోజుకు కనీసం ఆరు లీటర్ల నీళ్లు తాగాలి.
- ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి.
- పాలు, పెరుగు, నూనె పదార్ధాలు, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి
- పెరుగు మీద తేట, పల్చటి మజ్జిగ స్థూలకాయాన్ని నియంత్రించడంలో సాయపడతాయి.
- పండ్లు, పండ్ల రసాలు ఎక్కువ తీసుకోవాలి. నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ ఎంతో మంచిది.
- పోషకాలు ఎక్కువగా ఉండే ఆకు కూరలు అధికంగా తీసుకోవాలి
- వెన్న, చీజ్ వంటి పదార్ధాలు తీసుకోవడం మానేయాలి.
- రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం మంచిది
- వాము, శొంఠి, దాల్చిన చెక్క, మిరియాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి
- బరువును తగ్గించడంలో, శరీరంలోని కొవ్వును కరిగించడంలో పుదీనా చాలా బాగా పనిచేస్తుంది. రోజూ పుదీనా ఆహారంలో తీసుకోవాలి.
- పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే అన్నం, రొట్టెల కంటే పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలను సలాడ్స్‌గా తీసుకోవడం మంచిది.
- శరీరానికి కావల్సిన ప్రోటీన్లను అందించి.. బరువు పెరగకుండా ఉండాలంటే మార్కెటులో అమ్మే చపాతి పిండికి బదులు ఇంట్లోనే తయారు చేసుకునే చపాతి పిండిని ఉపయోగించాలి. ఇందుకోసం ఒక కేజీ గోధుమలు, అరకేజీ జొన్నలు, అరకేజీ సజ్జలు, అరకేజీ రాగులు, 100గ్రాములు సెనగలు, 100గ్రాములు సోయాబీన్స్, 100గ్రాములు బార్లీగింజలు కలిపి పిండిపట్టించుకోవాలి. ఈ పిండితో చేసే చపాతీలలో అధిక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికీ బలాన్నీ ఇస్తూ..అధిక బరువు పెరగకుండా నివారిస్తాయి.
- బేకరీ ఉత్పత్తులు, పెప్సీ, కోలా, కోక్ వంటి ఎయిరేటెడ్ డ్రింకులు, ఆల్కహాల్ తీసుకోవద్దు.
- వీటన్నింటితో పాటు పొద్దున్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. అధికబరువుతో ఇబ్బందిపడేవారికి ఇది మంచి టానిక్‌లా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా రోజూ తాగితే భవిష్యత్‌లో శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకు పోకుండా చూస్తుంది.
వ్యాయామం..
జీవనశైలీలో మార్పులు చేస్తూ.. ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా చేసే వ్యాయామం శరీరబరువును అదుపులో ఉంచుతుంది. రోజు అర గంట నుంచి 40నిమిషాల పాటు చేసే వ్యాయామం శరీరంలోని కొవ్వు నిల్వలను తగ్గించి.. అనేక జబ్బుల నుంచి రక్షణ ఇస్తుంది. అన్నింటికన్నా ఉత్తమమైన వ్యాయామం నడక. జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, స్కిపింగ్, ఔట్‌డోర్ గేమ్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అధిక బరువు సమస్యను నివారిస్తాయి.
అనారోగ్య సమస్యలు
భారీకాయం కారణంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, క్యాన్సర్, కిడ్నీల్లో రాళ్లు, అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యల వంటివి ఎన్నో అనారోగ్య సమస్యలు దాడి చేస్తాయి. మోకాలి కీళ్లు అరిగే ప్రమాదమూ ఉంది. ఇన్స్‌లిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పెరిగి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) తగ్గడంతో పక్షవాతం, గుండెజబ్బులు వస్తాయి. మనం ఒక కిలో బరువు పెరిగితే రోజుకి అదనంగా 30 కిలోమీటర్ల దూరం వరకు రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుందట. ఉండాల్సిన బరువు కన్నా అధిక బరువు ఉండే ఆ భారం మోయాల్సిన బాధ్యత గుండెదే. అందుకే స్థూలకాయల్లో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Authorization