ఎండాకాలం చెమటను భరించటమే కష్టం. ఇక చెమట పొక్కులు తోడైతే ఇక ఆ చిరాకును మాటల్లో చెప్పలేం. ఈ చెమట పొక్కులు మంట పెట్టకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. - క్లాత్‌లో ఐస్‌క్యూబ్స్ మూటగట్టి సమస్య ఉన్న ప్రదేశంలో 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచాలి. ఇలా ప్రతి నాలుగు గంటలకోసారి చేస్తూ ఉంటే 3 రోజులకి చెమట పొక్కులు మరింత పాకకుండా తగ్గిపోతాయి. - మెత్తగా పొడి చేసిన ఓట్‌మీల్‌ను చల్లని నీళ్లతో నింపిన బాత్‌టబ్‌లో వేసి కలపాలి. నీళ్లు పాల రంగులోకి మారాక బాత్‌టబ్‌లో 30 నిమిషాలు సేదతీరాలి. తర్వాత మెత్తని టవల్‌తో తడి అదుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చెమట పొక్కులు తగ్గుతాయి. - గంధం పొడి, రోజ్‌వాటర్ సమపాళ్లలో కలిపి చెమట పొక్కులు ఉన్న చోట అప్లై చేయాలి. పూర్తిగా ఆరాక చల్లని నీళ్లతో కడిగేయాలి. - ఒక కప్పు చల్లని నీళ్లలో ఒక టీస్పూను బేకింగ్ సోడా కలిపి వాష్‌క్లాత్‌ను నానబెట్టి పిండేయాలి. దీన్ని చెమట పొక్కుల మీద 10 నిమిషాలు ఉంచినా ఉపశమనం కలుగుతుంది. - ముల్తాని మట్టికి రోజ్‌వాటర్ చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని చెమట పొక్కుల మీద అప్లై చేసి ఆరాక చల్లని నీళ్లతో కడిగేయాలి. - లేత వేప ఆకుల్ని మెత్తగా నూరి అప్లై చేసి ఆరాక చల్లని నీటితో కడిగేయాలి. - వేపాకు ముద్దకు అర కప్పు శెనగపిండి, కొద్దిగా నీరు చేర్చి పేస్ట్‌లా చేయాలి. చెమట పొక్కులపై దీన్ని అప్లై చేసి ఆరాక కడిగేసుకోవాలి. - చెమట పొక్కులు రాకుండా ఉండాలంటే తరచుగా నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. - పుచ్చకాయ గుజ్జును పూసి ఆరాక కడిగేసుకోవాలి. - కర్పూరాన్ని పొడి చేసి తగినంత వేప నూనె చేర్చి పేస్ట్ తయారుచేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్న ప్రాంతంలో అప్లై చేసి 5 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. - కలబంద గుజ్జును అప్లై చేసినా ఉపశమనం కలుగుతుంది.