కొంత మంది పిల్లలు ఎప్పుడు చూసినా నలతగా కనిపిస్తారు. నీరసంగా ఉంటారు. ఆ తర్వాత కొద్దిరోజులకు శరీరమంతా వాచిపోతుంది. ఈ లక్షణాలు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేని 'నెఫ్రోటిక్ సిండ్రోమ్' అనే వ్యాధికి సంకేతాలు. కిడ్నీలు ఇన్ఫెక్షన్లకు గురికావడం వల్ల వచ్చే అనారోగ్య సమస్య ఇది. ఈ వ్యాధి వచ్చేవారిలో నూటికి 80 మంది 16 ఏళ్ల లోపు పిల్లలే ఉంటారు. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కలేదు. శరీరంలో వచ్చే మార్పులను గమనించి చికిత్స అందించాలి.
కిడ్నీల్లో సహజంగా గ్లొమరులై అనే ట్యూబులు, నెఫ్రాన్లు ఉంటాయి. మూత్రాన్ని వడబోయడం వీటి ప్రధాన ప్రక్రియ. మూత్రంలోని ప్రొటీన్లను గ్రహించి వాటిని ఇవి తిరిగి రక్తంలోకి పంపిస్తాయి. అలాగే, మూత్రంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తాయి. అయితే ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ ట్యూబులు ఒక్కోసారి వాపునకు లోనవుతాయి. ఫలితంగా ట్యూబులు, నెఫ్రాన్లు వడబోసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల శరీరానికి అత్యవసరమైన ఆల్బూమిన్ ప్రొటీన్లు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. దీన్ని 'ఆల్బమిన్యూరియా' అంటారు. రక్తంలో ప్రొటీన్లు తగ్గిపోవడం వల్ల శరీరమంతా వాచిపోతుంది. ముఖ్యంగా పొట్ట, ముఖం బాగా వాచిపోతాయి. కళ్ల చుట్టూ ఉబ్బి, కళ్లు మూసుకు పోతాయి జ్వరం, గొంతునొప్పి
ఉంటాయి. వైద్యపరీక్ష చేయిస్తే మూత్రంలో ప్రొటీన్లు కనిపిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం బాగా పెరిగిపోయి ఉంటుంది. దీన్ని 'హైపర్ కొలెస్టరీమియా' అంటారు. ఇది చాలా ప్రమాదకర స్థితి.
సమస్యను గుర్తించాలి..
నెఫ్రోటిక్ సిండ్రోమ్ వ్యాధిని కొందరు థైరాయిడ్ సమస్యగానూ, రక్తహీనత సమస్యగానూ పొరబడే అవకాశం ఉంది. అలాగే పిల్లల్లో పోషకాహార లోపాలతో వచ్చే క్వాషియార్కర్ వ్యాధిని కూడా నెఫ్రోటిక్ సిండ్రోమ్‌గా పొరబడే ప్రమాదం ఉంది. రెండింటిలోనూ రక్తంలో ప్రొటీన్ కొరవడుతుంది. ఈ రెండు వ్యాధుల్లోనూ నీరు నిలిచిపోయి శరీరం వాచిపోతుంది.
కొంతమందిలో నిరంతరం ప్రొటీన్లు పోవడం వల్ల హైపో ప్రొటినీమియా అన్న సమస్య మొదలవుతుంది. ఈ దశలో మామూలుగా ఇచ్చే మందులకు స్పందించే స్థితి కూడా ఉండదు. సమస్య తొలి దశలో ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే రెండు మూడు రోజుల్లోనే ఎంతో మార్పు కనిపిస్తుంది.
లక్షణాలు..
నెఫ్రోటిక్ సిండ్రోమ్‌ను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేసినా, సరియైన చికిత్స అందకపోయినా కిడ్నీలు పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం ఉంది. వ్యాధి ఎంతకాలంగా ఉందన్న దాని మీదే చికిత్సా కాలం ఆధారపడి ఉంటుంది.
పిల్లల్లో కనిపించే లక్షణాలను ముందుగా గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. సమస్య తగ్గినట్టే తగ్గి మళ్లీ రావడం దీని ప్రధాన లక్షణం.
నెఫ్రోటిక్ సిండ్రోమ్ రావడానికి ముందు పిల్లలు బాగా నలతగా కనిపిస్తారు.
మూత్రం అతి తక్కువగా వస్తుంది. మూత్రంలో కొద్ది రక్తం కూడా కనిపిస్తుంది. మూత్రం ద్వారా ప్రొటీన్లు పోతూనే ఉంటాయి.
మల బద్దకంతో బాధపడతారు.
ఎక్కువ నీరు శరీరంలో నిలిచిపోవడం వల్ల దాహం వేయదు. ఆకలి క్షీణిస్తుంది.
రక్తంలో ప్రొటీన్లు తగ్గిపోయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరమంతా వాచిపోతుంది.
వీటిల్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే డాక్టరును సంప్రదించాలి.
Authorization