ఎండాకాలంలో కండ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సీజన్లో కండ్లు తొందరగా అలసిపోయి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చిట్కాలు... టమాట, కీర, ఆలుగడ్డ స్లైస్‌లా కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. కండ్లు బాగా అలసిపోయినప్పుడు వీటిని కనురెప్పల మీద ఉంచితే హాయిగా ఉంటుంది. కంటి చుట్టూ రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. కాటన్ ప్యాడ్స్‌ను చల్లటి నీళ్లల్లో ముంచి పదినిమిషాలు కనురెప్పల మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ్ల కండ్లు తాజాగా అనిపిస్తాయి. చల్లటి నీళ్లల్లో విటమిన్-ఇ ఆయిల్ చుక్కలు కొన్ని వేసి అందులో కాటన్ పాడ్స్‌ను ఐదునిమిషాలు నాననిచ్చి, తర్వాత వాటిని కండ్ల మీద 20 నిమిషాలు పెట్టుకోవాలి. బాగా అలసిపోయిన కండ్లపై గ్రీన్ టీ బ్యాగ్స్‌ను పెడితే ఉపశమనం కలుగుతుంది. కండ్ల మంట తగ్గుతుంది. రెండు మూడు ఎగ్స్ తీసుకుని అందులోని తెల్లసొనను బాగా గిలక్కొట్టి కంటిచుట్టూ రాసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కళ్లు కడుక్కోవాలి. కండ్లు ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్, పాలకూర ఎక్కువగా తీసుకోవాలి. కంటినిండా నిద్ర పోవాలి. ఒత్తిడి పడకూడదు. వీలైనంతవరకూ ఎండాకాలంలో మేకప్, ఫౌండేషన్లకు దూరంగా ఉండాలి.