ఎండ ప్రభావం మనుషులు, ఇతర జీవరాశులపైనే కాదు, మనుషులు అనారోగ్యం బారినపడితే స్వస్థత చేకూర్చే మందులపైనా పడుతోంది. ఎండ తీవ్రతకు కొన్నిరకాల మందులు సామర్థ్యాన్ని కోల్పోయి ఎందుకూ పనికిరానివిగా మారుతున్నాయి. ఏటా ఈ విధంగా లక్షల రూపాయల విలువైన మందులు వథా అయిపోతున్నాయని ఒక సర్వే లో వెల్లడించారు. ముఖ్యంగా 28 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సిన కొన్నిరకాల యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఎండ తీవ్రతకు సామర్థ్యాన్ని కోల్పోయి, పనిచేయకుండా పోతున్నాయి. ఆయా మందులను పరీక్షించినప్పుడు నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్ఎస్ క్యూ) అని వస్తుండడంతో వినియోగించడానికి వీలు లేకుండా పోతోంది. WHO ఫార్మకోపియా, ఔషధ చట్టం 1940 సూచించిన టెంపరేచర్లోనే నిల్వ ఉంచాలి.
సాధారణంగా కొన్ని రకాల మందులను 30, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతల్లోనే నిల్వ చేయాలి. ఆ స్థాయి ఉష్ణోగ్రత దాటితే ఆయా మందులు పనికిరాకుండా పోయే అవకాశం ఉంది. అందుకే తప్పనిసరిగా ప్రతి ఫార్మసీ (మందులు నిల్వ చేసే గది) లో ఏసీలను ఏర్పాటుచేసుకుని ఆయా మందులకు అవసరమైన ఉష్ణోగ్రతలు వుండేలా థర్మామీటర్ ద్వారా చూసుకోవాలి. యాంటీ బయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ మాత్రం తప్పనిసరిగా నిర్దేశించిన ఉష్ణోగ్రతల్లోనే ఉంచాలి. సిఫ్రో ఫ్లాక్సిసిన్, సెఫా ట్రయాక్సిజోన్, ఓ ఫ్లాక్సిసిన్, టాక్సిమ్ వంటి యాంటీబయాటిక్స్‌తోపాటు ఐవీ ఫ్లూయిడ్స్‌ను 28 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచాలి. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య అధికంగా వుంటున్నట్టు చెబుతున్నారు. యాంటీ బయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ని తప్పనిసరిగా 28 డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాలి. ఇందుకోసం తప్పనిసరిగా ఫార్మసీల్లో ఏసీ సదుపాయం ఉండాలి. అయితే కొన్ని చోట్ల మందులు నిల్వ చేసే గదుల్లో ఏసీ సదుపాయం లేదని తెలుస్తోంది. దీనివల్ల ఏటా లక్షల విలువజేసే మందులు నిరుపయోగమవుతున్నాయి. అవే మందులను రోగులకు ఇచ్చేస్తున్నారు. ఆయా మందులు సామర్థ్యాన్ని కోల్పోతుండడం వల్ల వాటి వల్ల ఉపయోగం వుండడం లేదు.
జాగ్రత్తలు
వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు ప్రమాదభరితంగా మారాయి. బయటకు రావడం అలా ఉంచితే, ఇళ్లలోనే ఉండలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు వేసవిలో కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసే వారు ఎక్కువే. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులపై పడి పనిచేయకుండా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
- సాధారణంగా మందులను రూమ్ టెంపరేచర్ వద్ద, కూల్, డ్రై ప్లేస్ లో నిల్వ ఉంచాలి.
- రిలేటివ్ హ్యుమిడిటీ 60శాతం కన్నా తక్కువ ఉండాలి.
- బాత్రూం క్యాబిన్ లో గాని, కిచెన్ రూమ్ లో, రిఫ్రిజిరేటర్ పైన మందులను నిల్వ ఉంచకూడదు.
- రూమ్ టెంపరేచర్ :15 నుంచి 25 డిగ్రీల సెల్సియస్, కూల్ టెంపరేచర్ : 8 నుంచి 15 డిగ్రీల సెల్సియస్,
రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ : 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉండాలి.
సాధారణంగా 27 డిగ్రీల టెంపరేచర్ ఉండే నివాస గ హాల్లో ఎండ దెబ్బకి 30 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుంది. ఆరు బయట 40 డిగ్రీలు, మూసివున్న డాబా గదుల్లో 45 డిగ్రీల వరకూ, అద్దాలుమూసి నిలిపి ఉంచిన కార్లు, వ్యాన్లలో 140 డిగ్రీల వరకూ ఉండే అవకాశాలు ఉంటున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండుతున్న ఉష్ణోగ్రతలు దీర్ఘకాలిక మందుల పనితీరుపై సూర్యుడి ప్రభావం చూపి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రస్పుటంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మందులు భద్రపరిచే విధానం
మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక మందులు సాధారణంగా 25డిగ్రీల నుంచి 28డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చాలి. ముఖ్యంగా సిటాగ్లిప్టిన్, కార్ధేస్, ఆటర్వా స్టాటిన్, రాబెప్రజోల్, మేకోబాలమిన్ వంటి మందులను 28 డిగ్రీలలోపు భద్రపర్చాలి.
- అమరిల్, మెట్ఫార్మిన్ , ఆమ్లోడిపిన్, విటమిట్ ఇ, డి మందులు 25 డిగ్రీ టెంపరేచర్ లోపు భద్రపర్చాలి.
- ఇన్సులిన్ గుడ్డులో ఉండే ప్రోటీన్ వంటిదేనని, కొద్దిసేపు అధిక వేడిమికి గురైన గుడ్డును వేడిచేసే ఉడికినట్లు, ఇన్సులిన్ కూడా అదే విధంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక టెంపరేటర్‌లో ఉన్న తర్వాత ఫ్రిజ్ ఉంచినా ప్రయోజనం ఉండదు.
- మందులు కొనుగోలు చేసే సమయంలోనే నిర్ధిష్ట ఉష్ణోగ్రతలు ఉన్న ఫార్మసీ షాపుల్లో కొనుగోలు చేయాలని WHO, ఔషధ చట్టం 1940 సూచిస్తుంది .
అధిక ఉష్ణోగ్రతలో ఉంచిన మందులు వాడటం వల్ల వ్యాధులు అదుపులో ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.
- ఇన్సులిన్‌ను కూల్ ఫ్యాక్స్ లో భద్ర పరుచుకోవాలి. రిఫ్రిజిరేటర్లు లేని వారు మట్టికుండలో నీళ్లు పోసి, దానిలో ఇన్సులిన్‌ను భద్రపరుచుకోవచ్చు. ఐస్‌బాక్స్ లేదా, ఐస్ ఉన్న ప్లాస్కోలో ఉంచుకోవాలి.
- ప్రయాణాల్లో దీర్ఘకాలికమందులు, ఇన్సులిన్లను చల్లగా ఉండే పౌచ్‌ల్లో తీసుకెళ్లడం మంచిది.
- తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచినా కొన్ని మందులు పనిచేయవని నిపుణులు సూచిస్తున్నారు.
- ఇన్సులిన్ స్టాక్‌ను ఫ్రీజ్ డోర్ అడుగుభాగంలో పెట్టుకోవాలి. డీప్ ప్రీజర్‌లో ఉంచరాదు.
- బయటకు వెళ్లే టప్పుడు సరిపోను ఆహారం, గ్లూకోజ్ టెస్ట్స్ట్రిప్స్, మందులు రోజుకు సరిపడా తీసుకు వెళ్లడమే కాకుండా, అందుబాటులో ఉంచుకోవాలి.
ఎండలో, కార్లో వదిలేసిన గ్లూకో మీటర్, స్ట్రిప్స్ సరిగా పనిచేయవు. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.
- డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డ్డి,
ఫార్మకాలజిస్ట్, మెంబర్,
తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ .