మొలకల్లో విటమిన్ సి, కె ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి జుట్టు ఎదుగుదలకు బాగా ఉపకరిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణం వీటి సొంతం. పెసర పొట్టులో ఫొలేట్ అధికంగా ఉంటుంది. గర్భిణులకూ, గర్భస్థ శిశువుకు ఎంతో మేలు చేస్తుంది. పెసర మొలకల్ని సాధ్యమైనంత వరకూ పొద్దున పూట అల్పాహారంగా తీసుకోవాలి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఇన్ఫెక్షన్లూ, బ్యాక్టీరియా దూరమవుతాయి. అయితే కొద్దిమోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువగా తింటే అసిడిటీ సమస్య వస్తుంది. శెనగల మొలకల్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉండదు.బరువు తగ్గాలనుకున్న వారికి శెనగ మొలకలు చక్కని ఆహారం. చర్మ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రకరకాల అలర్జీలతో బాధపడేవారు వీటిని తింటే ఉపశమనం పొందుతారు. మధుమేహం ఉన్నవారు తీసుకుంటే చక్కెర అదుపులో ఉంటుంది. సలాడ్, చాట్, సూప్.. ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. బఠాణీల్లో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే ఎంతో శక్తి అందుతుంది. వీటిని తినడం వల్ల ఎక్కువ సమయం వరకూ ఆకలి దరిచేరదు. కొన్ని తీసుకుంటేనే పొట్ట త్వరగా నిండిన భావన కలుగుతుంది. దాంతో అధికబరువు సమస్య తలెత్తదు. వీటిలోని పోషకాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చెడు కొవ్వు నిల్వలు తగ్గిపోతాయి. అన్ని రకాల ధాన్యాలను మొలకులుగా తీసుకుంటే వాటిలోని పోషకాలు ఎక్కువగా అందుతాయి.