శరీరంలో నీటి శాతం తగ్గినా... నాలుక పొడిబారి బాగా ఇబ్బంది పెడుతుంది. ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల ప్రభావం వల్ల కొన్నిసార్లు ఈ పరిస్థితి ఎదురవుతుంది... అలాంటి సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే ఉపశమనం లభిస్తుంది. - నీటి శాతం తగ్గితే సహజంగా శరీరం డిహైడ్రేట్ అవుతుంది. ఇక దేహం మొత్తం పొడిబారటం, అలసట, ఆందోళన, తల నొప్పి వంటివి మొదలవుతాయి. ఈ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మంచిది. - దంత సమస్యలు ఉన్నవారు ఏం తీసుకోవాలన్న భయపడిపోతారు. అలాంటప్పుడు ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచా కొబ్బరి నూనె, ఆవనూనె, నువ్వుల నూనె, పొద్దుతిరుగు నూనె కలపాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని పుకలించాలి. ఇలా చేసిన చాలా వరకు సమస్య తీరుతుంది. క్రమం తప్పకుండా చేస్తే నోటి దుర్వాసన, దంత సమస్యలు కూడా దూరం అవుతాయి. - ప్రతిరోజు ఉదయం, రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి నీటిలో కలబంద రసాన్ని కలిపి నోటిని పుకలించడం వల్ల నోరు తడి ఆరకుండా ఉంటుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్. - సోపు గింజలు అజీర్తి, నోటి దుర్వాసనను, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నోరు బాగా పొడిబారినట్టు ఉంటే రోజుకు మూడు సార్లు ఒక చెంచా సోపు గింజలను నోట్లో వేసుకొని నములితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల నోటి తడి ఆరకుండా ఉంటుంది. - నిమ్మరసం లాలాజల గ్రంధులను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఆమ్లాలను, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచా తేనె, మూడు చెంచాల నిమ్మరసాన్ని కలుపుకొని తాగితే నోటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. - నాలుక పొడిబారినా, నోరంతా ఎండిపోయినట్టు అనిపించినా చిన్న అల్లం ముక్క, లవంగం నోట్లో వేసుకుంటే చాలు.