తీవ్రమైన నిస్సత్తువ, త్వరగా అలసిపోవటం, రోజువారీ పనులు పూర్తిచేడానికి ఓపిక లేకపోవడం వంటి చిన్నచిన్న సమస్యలు చాలామందిలో కనిపిస్తుంటాయి. మరికొందరిలో డే టైమ్లో నీరసంగా కనిపిస్తుంది. నిద్ర ముంచుకొచ్చినట్టుగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా వయసు పై బడిన వారిలో, మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. యువతలో ఈ రకం అలసట కనిపిస్తే.. దాన్ని తేలికగా తీసుకోవద్దు. దీన్ని 'క్రానిక్ ఫేటిగ్ సిండ్రోమ్'గా పిలుస్తారు. ఆరు నెలలు, అంతకన్నా ఎక్కువ రోజులు పగటిపూట మత్తుగా అనిపించినా, తీవ్రమైన నిస్సత్తువగా ఉన్నా డాక్టర్ను సంప్రదించాలి. ఈ లక్షణాలతో పాటు కండరాలు, కీళ్లు నొప్పిగా ఉన్నా వైద్యపరీక్షలు చేయించుకోవాలి. శరీరంలో రోగనిరోధకవ్యవస్థ పనితీరులో మార్పులే ఇందుకు కారణమని పరిశోధకులు అంటున్నారు. చాలాసార్లు ఇది తేలికపాటి వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాతే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్తో పోరాడటానికి అవసరమైన సైటోకైన్లనే టి కణాలు అస్తవ్యస్తంగా పనిచేయటమే ఇందుకు కారణం. దీర్ఘకాల నిస్సత్తువ అంత త్వరగా తగ్గేదేమీ కాదు. కొందరిలో ఏడాది కూడా పట్టొచ్చు. దీనికి ఆయా వ్యక్తులను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరమైతే నొప్పి, ఆందోళన, కుంగుబాటు వంటి వాటికీ మందులు వాడాలి. పోషకాహారం తీసుకుంటూ విటమిన్ మాత్రలు వేసుకోవాలి. రాత్రివేళ బాగా నిద్ర పోవాలి. రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయడం కూడా ఎంతో అవసరం. జీవనశైలిలో మార్పులతో క్రానిక్ ఫేటిగ్ సిండ్రోమ్ నుంచి బయటపడవచ్చు అని పరిశోధకులు సూచిస్తున్నారు.