ఎక్కువ మంది ఇబ్బంది పడే జబ్బుల్లో అస్తమా ఒకటి. గురక, దగ్గు, వాయునాళాలలో అడ్డంకులు ఏర్పడడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో కూడిన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధినే అస్తమా అని పిలుస్తారు. ఇది జీవనవిధానం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. తీవ్రమైన అవస్థతో తరచుగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. నిజానికి ఊపిరితిత్తుల్లో వాయునాళాల వాపు కారణంగా అస్తమా కలుగుతుంది. డస్ట్, స్మోక్ అలర్జీలు ఉండేవాళ్ళు, ఇంటిలోని సాధారణ దుమ్ము ధూళి వల్ల కూడా అవస్థ పడతారు. కొన్ని రకాల అలర్జీ కారకాల నుండి దూరంగా ఉంటే అస్తమా అవస్థలకు తగ్గించుకోవచ్చని అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఇంట్లో తేమ మూలంగా ఫంగస్ పెరుగుతుంది. దీని వల్ల అస్తమా పెరుగుతుంది. దీనిని నివారించాలంటే ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి, సహజమైన వెలుతురు ఎక్కువగా వచ్చేలా చూడాలి.
పొగాకు కాల్చడం ద్వారా వచ్చే పొగ, పరోక్ష ధూమపానం కూడా అస్తమా ఇబ్బందులకు కారణం అవుతుంది. ధూమపానం చేసేవారితో సమానంగా పరోక్ష ధూమపానం చేసేవారు కూడా కాన్సర్, అస్తమా వంటి సమస్యల బారినపడుతున్నారని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
బొద్దింకలు ఇంట్లో ఎక్కువగా ఉంటే అస్తమా ఎక్కువైతుంది. ముఖ్యంగా బొద్దింకల విసర్జనలు అస్తమాను పెంచుతాయి. బొద్దింకలు ఉండే ప్రాంతాల్లో ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి క్లీన్ చేయడం, తక్కువ వాసన ఉండే క్రిమిసంహారక మందులను ఉపయోగించాలి.
గడ్డి, కలప నుంచి వెలువడే పొగలోని కర్బన ఉద్గారాల కారణంగా, శ్వాసలో ఆటంకం ఏర్పడి అస్తమా రావడానికి కారణం అవుతుంది. పొగలో ఉండే హానికరమైన వాయువులు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయి.
వాయుకాలుష్యం ముఖ్యంగా వాహనాల నుంచి, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, దుమ్ము గాలిలో చేరుతుంది. ఇది అస్తమా పెరగడానికి కారణం అవుతుంది. గాలిలో దుమ్ము, ధూళి ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లేముందు రెస్పిరేటర్ మాస్క్ ధరించాలి.
కొందరిలో సైనస్ ఇన్ఫెక్షన్స్, మ్యూకస్ పొరల్లో ఇన్ఫ్లమేషన్(వాపు)కు కారణమవుతుంది. దీనిమూలంగా పొరలు మరింత శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. సైనస్ ఇన్ఫెక్షన్లు వంటి శ్వాసకోశ సంబంధిత అంటువ్యాధులు ఉన్న వారిలో అస్తమా తర్వగా వచ్చే ప్రమాదం ఉంది.
కొన్నిసార్లుపెంపుడు జంతువులు కూడా అస్తమా రావడానికి కారణం అవుతాయి. పెంపుడు జంతువుల బొచ్చు, మూత్రం, ఈకలు, లాలాజలంలో ఉండే ప్రోటీన్ల కారణంగా అలెర్జీ వస్తుంది. వాటిని తాకడం లేదా పీల్చడం వల్ల కొన్నిసార్లు అస్తమా వస్తుంది. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా ఉంచడం, టీకాలు వేయించడం తప్పనిసరిగా చేయాలి.
కొన్నిసార్లు వ్యాయామం కూడా అస్తమా పెరగడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా ఏరోబిక్ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మొదటి ఐదు నుంచి 15 నిమిషాలలో ఛాతీ బిగుతుగా మారడం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామందిలో ఈ లక్షణాలు అర గంట నుంచి గంటలో తగ్గిపోతాయి. కొందరిలో మాత్రమే అస్తమా రావడానికి కారణం అవుతాయి. ఇవే కాకుండా కొన్ని రకాల ఆహారపదార్థాలు, రసాయనాల వాసనలు కూడా ఉన్నాయి.
Authorization