రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే పొగ కమ్మినట్టుగా దుమ్ముధూళిలో కూడిన గాలి ముక్కు పుటాలను దాటుకుని ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఇలాంటి గాలిని ఎక్కువగా పీచ్చేవారికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు గనుల్లో, భవననిర్మాణాల్లో, ఇటుక పరిశ్రమల్లో పనిచేసేవారు ఎక్కువగా సిలికోసిస్ అనబడే ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధికి గురవుతారు. ఎక్కువగా దుమ్ము, ధూళి ప్రాంతాల్లో పనిచేసే వారి ఊపిరితిత్తులలో, శ్వాస మార్గాల్లో సిలికా పేరుకుని పోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి.
సిలికోసిస్లో మూడు స్థితులు ఉంటాయి.
అక్యూట్ : ఈ స్థితిలో ఊపిరితిత్తులు ఎర్రగా మారుతాయి. ఊపిరితిత్తులకు నీరు పట్టవచ్చు. రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉండటంతో శ్వాసలో తీవ్రమైన ఇబ్బందులకు కారణమవుతుంది. కొందరిలో రెండు మూడు వారాలకే వ్యాధి లక్షణాలు కనిపిస్తే, మరి కొందరిలో రెండు ఏండ్ల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి.
క్రానిక్ (దీర్ఘకాలిక) : పేరుకుపోయిన సిలికా ధూళి, ఊపిరితిత్తులు, ఛాతీలోని లింఫ్ నోడ్స్ లో వాపుకు దారితీస్తుంది. దీని మూలంగా శ్వాస తీసుకోవడం అత్యంత కష్టంగా ఉంటుంది. సిలికా ప్రభావానికి గురైన వారిలో మొదట్లో ఎలాంటి సమస్యలు లేకపోయినా, తరువాతి కాలంలో శరీరాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తాయి.
యాక్సలరేటెడ్ : ఊపిరితిత్తుల్లో తీవ్రమైన వాపు ఉంటుంది. సిలికా తీవ్ర ప్రభావానికి గురైన 5 నుండి 10 ఏండ్ల తరువాత లక్షణాలు కనిపించి, తీవ్రమైన అనారోగ్యానికి గురి చేస్తాయి.
కారణాలు :
క్రిస్టలిన్ సిలికా (స్పటిక రూపంలోని సిలికా) శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల సిలికోసిస్ సమస్య తలెత్తుతుంది. మైనింగ్, కట్టింగ్, డ్రిల్లింగ్, ఇసుక, గ్రానైట్ పరిశ్రమల్లో ఎక్కువ కాలం పనిచేయడం ఈ సమస్యకు ముఖ్యకారణం. గ్లాస్ తయారీ, సిరామిక్స్ వర్క్, క్వారీయింగ్ పరిశ్రమల్లో పనిచేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
లక్షణాలు :
- కఫం
- అసాధారణమైన దగ్గుతో కూడిన ఇబ్బంది
- శ్వాసమీద ప్రభావం
- అలసట
- ఛాతీ నొప్పి
- బరువు నష్టం
- పెదాలు చిట్లడం, నల్లగా మారడం
- కాళ్ళ వాపు
- ఆకస్మిక జ్వరం
- శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. సిలికోసిస్ సమస్యతో బాధపడే రోగులకు ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, దీర్ఘకాలిక బ్రాంకైటిస్ వంటి ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదాలు అధికంగా ఉంటాయి.
జాగ్రత్తలు..
- దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండే పరిశ్రమల్లో పనిచేసేవారే కాకుండా దుమ్ము, ధూళి మోతాదు గాలిలో ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారు కూడా జాగ్త్రతగా ఉండాలి.
- పరిశ్రమలో పనిచేసేవారు రక్షణ కోసం సరైన యూనిఫామ్ వేసుకోవాలి.
- సిలికా ధూళి ప్రాంతాలలో పనిచేసేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించండి.
- వాయు కాలుష్యం, దుమ్ము , ధూళీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉండవద్దు
- సిలికా డస్ట్ ఉన్న ప్రదేశానికి దగ్గరల్లో తినడం లేదా తాగడం చేయవద్దు.
- భోజనానికి ముందు చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి.
- పని గంటల తరువాత వెంటనే స్నానం చేసి, దుస్తులను మార్చుకోవాలి. .
Authorization