వెన్నునొప్పి నొప్పిలో ఇటీవల కాలంలో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు ముఖ్యకారణం ఇది చాలా తరచుగా వచ్చే సమస్యలలో ఒకటి. పెద్ద వాళ్ళలో ప్రతి పది మందిలో తొమ్మిది మందికి, జీవితంలో ఎప్పుడో ఒకసారి వెన్ను నొప్పి వస్తుంది. ఇందుకు మారుతున్న జీవనశైలి కావచ్చు. పని విధానంలో వచ్చిన మార్పులు కావచ్చు. వెన్నునొప్పిని వైద్యపరిభాషలో 'డోర్సాల్జియా' అని పిలుస్తారు. ఇది వీపులో నుంచి వచ్చే నొప్పి. సాధారణంగా కండరాల నుండి కాని, నరాల నుండి కాని, ఎముకల నుండి కాని, కీళ్ళ నుండి కానీ, వెన్నుపాములోని ఇతర నిర్మాణాల నుండి కాని నొప్పి ప్రారంభమవుతుంది. నొప్పి వచ్చే భాగాన్ని బట్టి మెడనొప్పి, వెన్ను పై భాగపు నొప్పి, వెన్ను దిగువ భాగపు నొప్పి, హలాస్థి నొప్పిగా విభజిస్తారు.
లక్షణాలు..
- ఇది ఆకస్మికంగా రావచ్చు. కొన్నిసార్లు ఎడతెగని నొప్పిగా మారి బాధిస్తోంది. మరికొందరిలో విడతలు విడతలుగా వస్తూ పోతూ ఉంటుంది. కొందరిలో ఒకే చోట కానీ, వెన్నులోని వివిధ భాగాలకు కానీ విస్తరిస్తోంది. నొప్పి లేకుండా కొంతమందిలో బలహీనంగా అనిపించడం, మైకము, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపించవచ్చు.
- నాలుగు వారాల పాటు నొప్పితో బాధపడితే కొంచెం తీవ్రమైన నొప్పిగా, పన్నెండు వారాల వరకు నొప్పి ఉంటే తీవ్రమైన అంశంగా, అంతకన్న ఎక్కువ కాలం నొప్పి ఉంటే అతితీవ్రమైన సమస్యగా భావించాలి.
- వెన్నునొప్పితో బాధ పడే వారిలో 98శాతం మందిలో అతి సాధారణంగా వచ్చే నొప్పిగానే ఉంటుంది. కేవలం రెండు శాతం మందిలో మాత్రమే ఇతర అనారోగ్య సమస్యలకు కారణం అవుతోంది. అరదుగా క్యాన్సర్ వల్ల కాని, వెన్నుపాములోని అస్థి మజ్జలో కలిగే నొప్పి వల్ల కాని, ఎపిడ్యురల్ పుండ్ల వల్ల కానీ కలుగుతుంది.
కారణాలు.
- ఎక్కువ సమయం పాటు కూర్చుని చేసే ఉద్యోగాలు, స్థూలకాయం, సరైన భంగిమ పాటించకుండా బరువులు ఎత్తడం, ఎక్కువసేపు ఒకే భంగిమలో నిలబడడం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు... ఇలా వెన్ను, నడుము నొప్పికి బోలెడన్ని కారణాలున్నాయి.
- స్థూలకాయులైన మహిళలు ఎక్కువ సేపు వంటగదిలో నిలబడి పని చేయడం వల్ల శరీర బరువు వెన్ను మీద పడి నొప్పి మొదలవవచ్చు.
- కొందరిలో హెరిడిటీ కారణంగా వెన్నునొప్పులు ఎక్కువగా ఉంటాయి. యాంకిలోజింగ్ స్పాండి లైటిస్, న్యూరోఫెబ్రొమాటిస్, స్కోలియోసిస్, మెదడు లేదా వెన్నుపూసలలో ఉండే కొన్ని అసాధారణ కారణాల వల్ల వెన్ను నొప్పి వస్తుంది. ఈ తరహా సమస్యలు పుట్టుకతో వచ్చే లోపాల కారణంగా వస్తాయి. దగ్గరి బంధువులను పెళ్ళిళ్లు చేసుకోవడం అన్నది ఈ తరహా సమస్యలకు ఎక్కువగా దోహదపడే అంశం.
- పిల్లలు పాఠశాల బ్యాగ్‌ను మోస్తున్న సమయంలో వాళ్ల భుజాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో కూడా వెన్ను నొప్పి రావచ్చు. వారి సామర్థ్యం కంటే ఎక్కువ భారాన్ని మోసే సమయంలో ఒకటి రెండు తరాల తర్వాతి వారికి వెన్నునొప్పి వస్తుందని కొన్ని పరిశోధనల్లో స్పష్టమైంది.
- ఎముక బలహీనమైపోయే ఆస్టియోపోరోసిస్ వ్యాధులు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. దాంతో వచ్చే సమస్యలైన ఫ్రాక్చర్లు, ఇతర కాంప్లికేషన్స్ ఎక్కువ. పైగా పొట్ట తగ్గించడానికి చేయించుకునే బేరియాటిక్ సర్జరీలతో కాల్షియం, విటమిన్ డి వంటి సప్లిమెంట్లు సరిగా అందక పోవడం వల్ల కూడా ఎముక సాంద్రత కోల్పోయి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.
- స్టెరాయిడ్స్, థైరాక్సిన్, గ్రోత్ హార్మోన్స్, కీమో థెరపీ... వంటి సందర్భాల్లోనూ ఎముకలపై వాటి ప్రభావం ఉంటుంది. వెన్నెముక నొప్పికి ఇవి కూడా కారణమే.
- చాలా సందర్భాల్లో మెడ దగ్గర నుంచి భుజానికి నొప్పి పాకడం వంటి సమస్య కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో భుజం నుంచి చేతి వేళ్ల వరకు కాస్త బలహీనంగా మారినట్లుగా కూడా అనిపించవచ్చు. వెన్నెముకలోని డిస్క్‌లు ఒకదానితో మరొకటి ఒత్తుకోవడం వల్ల ఇలాంటి సమస్య రావచ్చు. దాన్ని సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. దీని వల్ల వెన్నులో కొన్ని శాశ్వత (ఇర్రివర్సిబుల్) మార్పులు రావచ్చు. అందుకే కొన్ని సందర్భాల్లో ముందుగానే సమస్యను కనుగొని తగిన చికిత్స తీసుకోవడం అవసరం.
- మరికొన్ని సందర్భాల్లో వెన్నులో నొప్పి... వీపుకు పైభాగంలో మెడ వద్ద ఉన్న వెన్నుపూసలలో నొప్పితోనూ రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మందులు కూడా పనిచేయనప్పుడు అత్యంత సునిశితంగా నిపుణులు శస్త్రచికిత్సతో ఆ సమస్య లకు చికిత్స చేయవచ్చు.
జాగ్రత్తలు..
- ఈ నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే జీవన శైలిలో, అలవాట్లలో, శరీర భంగిమల్లో మార్పులు చేసుకోవాలి
- బరువులు ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచాలి.
- స్థూలకాయులైతే అధిక బరువు తగ్గించుకోవాలి.
- ఎక్కువ సమయం కుర్చీలో కూర్చుని పని చేసేవాళ్లు మధ్యమధ్యలో లేచి పది నిమిషాలు నడుస్తూ ఉండాలి.
- వెన్ను నొప్పి వేధిస్తుంటే వైద్యులను కలిసి కారణాలు తెలుసుకొని, వారి సూచనలు పాటించాలి.
- డాక్టర్ లక్ష్మణ్ రావు
మల్లునరసింహా రెడ్డి స్మారక ప్రజా వైద్యశాల
ఎం.హెచ్.భవన్, అజామాబాద్, హైదరాబాద్
Authorization