నిద్ర.. అలసిన శరీరానికి ఉపశమనం ఇస్తుంది. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్య కరంగా, ఆనందంగా ఉంటారు అన్న విషయాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాబా యూరప్‌లోని వార్విక్ యునివర్సిటీ పరిశోధకులు చిన్నారుల నిద్రపై, వారిలో మేధాశక్తికి నిద్ర ఎంత మేరకు కారణం అవుతోంది అన్న విషయంపై పరిశోధనలు నిర్వహించారు. చిన్నారులు కంటినిండా నిద్రపోకుంటే వారిలో మేధాశక్తి ఆశించిన మేరకు పెరగదని, నిద్ర వల్ల మెదడులో నిర్మాణాత్మక మార్పులు జరుగుతాయని స్పష్టం చేశారు. తక్కువ సమయం నిద్రపోయే వారిలో మేధాశక్తి తగ్గడంతో పాటు మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వీరు 9 నుంచి 11 ఏండ్లలోపు వయసు కలిగిన పదకొండ వేల మంది చిన్నారులపై పరిశోధనలు నిర్వహించారు. వాళ్ళు రోజూ ఎంత సేపు నిద్రపోతున్నారు? వారి తెలివితేటలు ఏ విధంగా పెరుగుతున్నాయి? మేధాశక్తిలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? అనే అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేశారు.