Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ బాలుడిని లాఠీతో కొడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయిన తరువాత ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఢిల్లీలోని ఆర్కే పురం ప్రాంతంలో నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ బాలుడిని కర్రతో కొడుతుండగా పక్కన మరో కానిస్టేబుల్ నిల్చొని చూస్తున్నాడు. ఈ తతంగాన్ని ఎదురుగా ఉన్న మరో యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. అయితే యువకుడిని పోలీస్ ఎందుకు కొట్టాడో తెలియరాలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని కామెంట్లు పెడుతున్నారు. సంఘటన తరువాత కానిస్టేబుల్‌పై డిపార్ట్మెంటల్ విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశాం. ఈ విషయంపై విచారణను కూడా ప్రారంభించాం అని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నైరుతి) దేవేందర్ ఆర్య చెప్పారు. నిజ నిర్ధారణ జరిపిన తరువాత కానిస్టేబుల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని ఆర్య పేర్కొన్నారు.