Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ నిఘా విభాగం దాడి చేసి హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో పట్టుకుంది. వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన శివ బాలక్, రాహుల్ కాశ్యప్ లుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 330 ఇండియన్ టెంట్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ ఒకటిలో తాబేళ్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిని పట్టుకోవటం, తరలించటం, అమ్మటం నేరం అని వారు తెలిపారు. ఇండియన్ టెంట్ లేదా అస్సాం రూఫుడ్ టార్టయిస్ గా పిలిచే ఈ తాబేళ్లు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయని చెప్పారు.
లక్నో సమీపంలో గోమతి నదిలో వీటిని నిందితులు పట్టుకుని రైళ్ల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టుకున్న ఇద్దరినీ మేడ్చల్ జిల్లా ఉప్పల్ రేంజ్ అధికారికి అప్పజెప్పారు. తదుపరి విచారణ పోలీసుల ద్వారా కొనసాగుతుందని అధికారులు చెప్పారు.
ఇదిలా ఉండగా పెట్ షాపులు, అక్వేరియం షాపుల నిర్వాహకులు వీటిని కొంటున్నట్టు సమాచారం. తాబేళ్లను కొనటం, అమ్మటం నిషేధమని, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని షాపుల నిర్వాహకులను అటవీశాఖ హెచ్చరించింది. అలాగే తాబేళ్లను ఇండ్లలో పెంచుకోవటం వల్ల అదృష్టం కలిసివస్తుందనే వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. పీసీసీఎఫ్ (విజిలెన్స్) స్వర్గం శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరగింది. రమేష్ కుమార్, రేంజ్ అధికారి (యాంటీ పోచింగ్ టీమ్), జీ. సీతారాములు, వాహెద్, శ్రీనివాసులు, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు