Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పేద పోడు రైతులపై ప్రభుత్వ దాడులు, నిర్బంధాలు, పంటల విధ్వాంసాన్ని ఎదిరించి పోరాటాలతోనే పోడు భూములను దక్కించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆసీఫాబాద్ జిల్లా కొమరంభీం జోడేఘాట్ నుంచి ప్రారంభించిన పోడుయాత్ర ఆదివారం భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల్లోని ఏజెన్సీలో జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ సరిహద్దు గ్రామమైన పడగాయిగూడెంలో జరిగిన సభలో చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ అడవినే నమ్ముకొని అనాధిగా జీవనం సాగిస్తున్న గిరిజనులు, గిరిజనేతర పేదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవనం లేకుండా చేస్తోందని విమర్శించారు. ప్రధానంగా భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల పరిధిలో లక్షలాది మంది పేదలు, గిరిజనులు ఆరు దశాబ్ధాలకు పైగా పోడు సాగు చేసుకుంటున్నారని, ఈ భూములకు హక్కుపత్రాలు అందించడంలో పాలకులు విఫలమయ్యాయని తప్పుబట్టారు. అనేకపోరాటాలతో సాధించుకున్న 2006 అటవీ హక్కుల పరిరక్షణ చట్టానికి తూట్లు పొడిచే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని వెంకటరెడ్డి దుయ్యబట్టారు.