Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఢిల్లీలో ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో రెండు రోజుల నవజాత శిశువుకు అత్యంత అరుదైన సర్జరీని వైద్యులు నిర్వహించి పుట్టుకతోనే ఏర్పడిన కణితిని తొలగించారు. ఈ మేరకు ఆస్పత్రి వారు విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు పూర్తి వివరాల్లోకెళ్తే ఇంట్రా-పెరికార్డియల్ టెరటోమా(గుండె పైభాగం నుంచి ఏర్పడే) అని పిలిచే కణితి తల్లి గర్భంలో ఉన్నపుడే శిశువుకు ఏర్పడింది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో తల్లి చేరగా 3.2 కిలోల బరువుతో ఆ శిశువు జన్మించాడు. పుట్టిన వెంటనే శ్వాస తీసుకోవడంలో శిశువుకు ఇబ్బంది ఎదురైంది. దాంతో వెంటనే ఆ శిశువును ఇంట్యుబేట్ చేసి వెంటిలేటర్‌పై ఉంచారు. సిటి ఆంజియో నిర్వహించి చూడగా 7 సెంటీ మీటర్ల పొడవైన కణితి కనిపించింది. అది గుండెకు ఎడమ వైపున ఏర్పడి ఊపిరితిత్తిపై ఒత్తిడి పెంచుతున్నట్టు వైద్యులు గుర్తించారు. శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు.
ఈ మేరకు ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి సీనియర్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రాజేష్ శర్మ మాట్లాడుతూ ఆ శిశువు గుండె కన్నా పెద్దగా ఉన్న కణితిని తొలగించామన్నారు. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జ్ చేశామని ఆయన చెప్పారు.