Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్ లో ప్రతిభను కనబరిచిన హాకీ క్రీడాకారిణి ఇ.రజనీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా రజనీకి పుష్ఫగుచ్ఛం అందించి, శాలువా కప్పి జగన్ సత్కరించారు. ఆమెకు జ్ఞాపికను అందించారు. అనంతరం ఆమెకు ప్రోత్సాహకాలను అందించారు. ఆమెకు రూ. 25 లక్షల నగదుతో పాటు, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రజనీకి గతంలో ప్రకటించి, పెండింగ్ లో ఉంచిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుపతిలో వెయ్యి గజాల నివాస స్థలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వాలని ఆదేశించారు. రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. ఒలింపిక్స్ లో పాల్గొన్న ఏకైక దక్షిణాది క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందారు. 2016 రియో ఒలింపిక్స్ లో కూడా ఆమె పాల్గొన్నారు. భారత్ తరపున 110 అంతర్జాతీయ మ్యాచ్ లలో ఆమె ఆడారు. గోల్ కీపర్ గా మంచి ప్రతిభను కనబరిచారు.