Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్ రకానివే ఉన్నట్లు తేలింది. క్రమంగా ఈ వేరియంటే స్థిరపడిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో రోజురోజుకూ డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసుల శాంపిళ్లను శాస్త్రవేత్తలు జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఆ వివరాలు తాజాగా గ్లోబల్ ఇన్షియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్ఏఐడీ)లో పొందుపరిచారు. అన్ని దేశాల జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను ఇందులోనే అధికారికంగా పొందుపరుస్తారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో డెల్టా వేరియంట్ ఏ స్థాయిలో ఉందో ప్రస్తావించడం గమనార్హం. జూలైలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 95 శాతం డెల్టా వేరియంట్‌వేనని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో జగిత్యాల, జనగాం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, ములుగు, నాగర్‌కర్నూలు, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, వరంగల్ వంటి 14 జిల్లాల్లో నమోదైన కేసులన్నీ డెల్టా వేరియంట్‌వేనని నిర్ధారించారు. హైదరాబాద్‌లో నమోదైన వాటిల్లో 94 శాతం, గద్వాల జిల్లాలో 93%, సూర్యాపేట జిల్లాలో 86% కేసులు డెల్టా రకానివని కనుగొన్నారు.