Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బృందం రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన సమయంలో ఏపీ అధికారులు ఉన్న నేపథ్యంలో కమిటీ ఇచ్చే నివేదికపై తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ లేఖ రాశారు. తెలంగాణ ఫిర్యాదు ఆధారంగా ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల తర్వాత చాలా ఆలస్యంగా కేఆర్ఎంబీ బృందం రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించిందని లేఖలో పేర్కొన్నారు. తాము ఫిర్యాదు దారులమైనందున తమ ప్రతినిధులను కూడా బృందం వెంట తీసుకెళ్లాలని బోర్డు ఛైర్మన్‌ను కోరామన్న రజత్ కుమార్.. తటస్థులు మాత్రమే వెళ్లాలన్న కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఛైర్మన్ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదన్నారు. ఈనెల 11న రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన సమయంలో కృష్ణా బోర్డు బృందంతో పాటు ఏపీ ఈఎన్సీ, సీఈలు ఉన్నారని, బృంద సభ్యులతో మాట్లాడటంతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారని లేఖలో తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేఆర్ఎంబీ ఇచ్చే నివేదిక నిష్పాక్షికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ లేఖలో వెల్లడించింది. ఏపీ అధికారుల చర్యలు కృష్ణా బోర్డు బృందాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. లేఖ ప్రతులను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కార్యాలయం, కార్యదర్శికి కూడా రజత్ కుమార్ పంపారు.