Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇద్దరు భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం పై ముంబై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దంపతుల మధ్య బలవంతపు శృంగారం చట్టవిరుద్ధం కాదని ముంబై అడిషనల్ సెషన్స్ జడ్జి సంజశ్రీ జే ఘరత్ తీర్పు ఇచ్చారు. ఇది చట్టం ముందు నిలబడదు అని వారు స్పష్టం చేశారు. మహారాష్ర్టకు చెందిన ఓ వారు బాధిత మహిళ తన భర్త తనపై బలవంతంగా కోరిక తీర్చుకున్నాడని దాని వల్ల తాను అనారోగ్యం పాలయ్యానని కోర్టు కెక్కగా కోర్టు ఈ తీర్పునిచ్చింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళకు గతేడాది నవంబర్ 22న వివాహమైంది. పెండ్లయిన కొద్ది రోజులకు ఆమెను ఆమె భర్త, కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులకు గురిచేశారు. అంతేకాకుండా వివాహమైన నెల రోజుల తర్వాత ఆమెతో బలవంతంగా శృంగారంలో పాల్గొన్నాడు. అనంతరం ఈ ఏడాది జనవరి 2న భార్యాభర్తలిద్దరూ కలిసి మహాబలేశ్వర్కు వెళ్లారు. అక్కడ కూడా ఆమెపై ఆమె భర్త బలవంతంగా తన కోరిక తీర్చుకున్నాడు. తర్వాత ఆమె అనారోగ్యానికి గురికావడంతో వైద్యున్ని సంప్రదించింది. పరీక్షించిన వైద్యుడు ఆమె నడుము కింది భాగం పక్షవాతానికి గురైనట్లు నిర్ధారించాడు. దాంతో తన భర్త బలవంతంగా తనతో శృంగారం చేయడంతోనే ఈ సమస్య వచ్చిందని భావించిన ఆమె.. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టుకు వెళ్లగా విచారణ సందర్భంగా దంపతుల మధ్య బలవంతపు శృంగారం చట్టం ముందు నిలబడదు అని జడ్జి స్పష్టం చేశారు. కానీ ఆమె పక్షవాతానికి గురవడం దురదృష్టకరం అని అన్నారు. అనంతరం బాధితురాలి భర్తకు బెయిల్ మంజూరు చేశారు.