Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇటీవల తెలుగులో యూట్యూబ్ లో 30 వెడ్స్ 21 అనే వెబ్ సిరీస్ వచ్చింది. అందులో భర్త వయసు 30 కాగా భార్య వయసు 21 మాత్రమే. అయితే దీని పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అంత ఏజ్ గ్యాప్ ఉంటే ఎలా కలిసి ఉంటారు.. సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటూ కొందరు మండిపడ్డారు. అయితే వారు ఈ వార్త చూస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారో..అవును ఎందుకంటే 67 ఏండ్ల వృద్ధుడు.. ఓ 19 ఏండ్ల వయసు గల టీనేజీ యువతిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రంలోని హతిన్ నగర పరిధిలోని హంచ్పురీ గ్రామంలో ఓ వృద్ధుడికి 67 ఏండ్లు. ఆయనకి చాలా ఏండ్ల క్రితమే పెండ్లి కాగా అతడి భార్య నాలుగేండ్ల క్రితమే చనిపోయింది. అతనికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వాళ్లందరికీ పెండ్లీలు కూడా అయిపోయాయి. ఇదిలా ఉండగా 19 ఏండ్ల వయస్సు ఉన్న యువతి కుటుంబానికి ఆ గ్రామంలో భూతగాదాలు ఉన్నాయి. వాటిని ఆ వృద్ధుడు తాను పరిష్కరిస్తానని చెప్పి ఆ కుటుంబంతో కలిసిపో యాడు. ఈ క్రమంలోనే యువతితో చనువు పెంచుకొని ప్రేమించి పెండ్లి చేసుకుంటానన్నాడు. ఇదివరకే పెండ్లయి భర్తకు దూరంగా ఉంటున్న ఆమె కూడా పెండ్లికి ఒపుకోవడంతో ఇద్దరూ ఇటీవలే ఓ గుడిలో పెండ్లి చేసుకున్నారు. అయితే ఇంత లేటు వయసులో అంత తక్కువ వయసు పిల్లతో పెండ్లేంటంటూ అతడి కూతుళ్లు, తాత వయసు వాడితో పెళ్లేంటని ఆ యువతి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. దాంతో ఆ వృద్ధుడు, ఆ యువతి తమకు రక్షణ కల్పించాలంటూ మొదట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆ తర్వాత హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి వ్యవహారంపై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి ఇరువురినీ వేరు వేరు చోట్ల ఉంచి రక్షణ కల్పించాలనీ, అదే సమయంలో ఈ 67ఏండ్ల వృద్ధుడి వ్యవహారం గురించి, గతంలో అతడి ప్రవర్తన గురించి కూడా ఆరా తీయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆ యువతి కూడా స్వయంగా జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరయి తన స్టేట్మెంట్ను ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులకు విచారణ చేపట్టారు. అనంతరం వివరాలను కోర్టుకు సమర్పించారు. అందులో ఆ యువతి.. తను ఎవరూ ఒత్తిడి చేయలేదని, తానే అతడిని ఇష్టపడి పెండ్లి చేసుకున్నాను అని చెప్పింది. తన అమ్మ కూడా ఈ పెండ్లికి అంగీకరించిందని చెప్పింది. పెండ్లి సమయంలో బంగారం కూడా పెట్టారని అంది. తనకు కూడా గతంలో పెండ్లయిందని కానీ తన భర్త నుంచి విడిపోయానని చెప్పింది. ఇప్పుడు మరో పెండ్లి చేసుకున్నానని.. తన మాజీ భర్తకు కూడా ఈ పెండ్లి విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నానని యువతి స్వయంగా జిల్లా మేజిస్ట్రేట్ ముందు తన స్టేట్మెంట్ను ఇచ్చింది. ఆమె స్టేట్మెంట్ స్పష్టంగా ఉండడంతో.. ఈ కేసులో కోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.