Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఇండ్లకు నిధులు కేటాయించాలి
హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్బెడ్రూం ఇళ్ళకోసం పేదలు గంపడాశతో ఎదురుచూస్తున్నారు. కానీ నిర్మాణం పూర్తైన ఇండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. కొన్ని ఇండ్లు నిర్మాణం మధ్యలో ఆగిపోగా, చాలా వరకు అసలు నిర్మాణాలే ప్రారంభించలేదు. దీంతో పేదల ఆశలు నిరాశగానే మిగిలిపోయింది. తక్షణమే పూర్తయిన ఇండ్లను లబ్దిదారులకు కేటాయించి, నిర్మాణం పూర్తిగాని ఇళ్ళను ఒక కాలపరిమితిలో పూర్తిచేసి పేదలకు కేటాయించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
2014లో అధికారానికొచ్చిన వెంటనే రాష్ట్రంలో లక్షలాది డబుల్బెడ్రూంలు కట్టిస్తామని, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రెండు లక్షల ఇండ్లు నిర్మిస్తామని టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకున్నది. ఏడేళ్ళుదాటినా 2,91,000 ఇండ్లు మాత్రమే మంజూరు చేసి, కేవలం 1,80,000 పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాపితంగా కేవలం 16570 ఇండ్లు మాత్రమే లబ్దిదారులకు స్వాధీనం చేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. ఇండ్ల నిర్మాణం కూడా నాసిరకంగా ఉండడంతో వర్షాలకు కురిసి, కొన్ని చోట్ల కూలిపోతున్నాయి. పూర్తైన ఇండ్లు లబ్దిదారులకు ఇవ్వకపోవడంతో వాటిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. కంపచెట్లతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పదకొండు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి పూర్తిచేసిన ఇండ్లను లబ్దిదారులకు ఇవ్వకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఇది ఆర్థిక ఆరాచకత్వమే. మరోప్రక్క 8వేల కోట్లు కేటాయిస్తే మిగిలిన ఇండ్లన్నీ కూడా పూర్తిచేయొచ్చు.
కాబట్టి అసంపూర్తిగా ఉన్న ఇండ్లతో పాటు, అసలు నిర్మాణాలు ప్రారంభించని ఇండ్ల నిధులు కేటాయించి, ఒక నిర్ధిష్టమైన కాలపరిమితిలో వాటి నిర్మాణాలు పూర్తిచేయాలని, ఇప్పటికే పూర్తయిన ఇండ్లను సెప్టెంబర్ నెలలోపు లబ్దిదారులకు అప్పజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.