Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న వయసులోనే పెద్ద నిర్ణయం..
క్యాన్సర్ రోగుల కోసం శిరోజాల దానం..
నవతెలంగాణ -సిటీబ్యూరో
మనిషికి అందాన్ని తెచ్చిపెట్టే జుట్టు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మరీ ముఖ్యంగా, మహిళల అందంలో ఎనలేని పాత్ర పోషించే జుట్టును క్యాన్సర్ రోగుల కోసం పెద్ద మనసుతో దానం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది ఓ చిన్నారి. వివరాల్లోకెళ్తే.. నగరానికి చెందిన పివిబిపి శర్మ-పిఎస్వీ శైలజల కూతురు సహృద ఐదో తరగతి చదువుతుంది. తన ప్రతీ జన్మదినం సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగానే సహృద ఈ ఏడాది తన పదో జన్మదినం సందర్భంగా తన పొడవాటి శిరోజాలను క్యాన్సర్ రోగుల కోసం దానం చేయాలని మంచి మనసుతో గొప్ప నిర్ణయం తీసుకుంది. తన శిరోజాలను నగరానికి చెందిన హైదరాబాద్ హెయిర్ డొనేషన్ సంస్థ ప్రతినిధి ఉదయ్ కు, నగరంలోని బెయోన్స్ హెయిర్ అండ్ బ్యూటీ స్టూడియోలో టీమ్ హెయిర్ స్టైలిస్ట్ మహేష్ కోడెపాక సమక్షంలో అందజేశారు. తల్లిదండ్రుల సహాయంతో తన శిరోజాలను ఇలా క్యాన్సర్ రోగుల కోసం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఎదుటివారికి మనం ఆర్ధికంగా సహాయం చేయకపోయినా తమ చేతిలో ఉన్న ఈ చిన్న సహాయాన్ని చేయడంలో ఎంతో ఆనందంగా ఉందని చిన్నారి తెలిపింది. అనంతరం చిన్నారి సహృదను అభినందిస్తూ సంస్థ ప్రతినిధి ఉదయ్ సర్టిఫికెట్ అందజేశారు.