Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి రైతుల వెన్నుముకను మోడీ ప్రభుత్వం విరిచిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు నెలల తరబడి పోరాటాలు చేస్తున్నాయని చెప్పారు. ఆదివారం గాంధీభవన్ లో జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజలకు 75వ స్వాతంత్ర విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తమ దేశాన్ని తామే పాలించుకోవాలని దేశ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసిందన్నారు. ఎంతో మంది త్యాగధనుల పోరాట ఫలితమే నేటి మన స్వతంత్ర భారత దేశమని అన్నారు. విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు శాంతి యుతంగా కాంగ్రెస్ నిర్వహించిందన్నారు. మహాత్మాగాంధీ శాంతి యుత ఉద్యమాలు చేసి ప్రపంచంలో ఆదర్శగా నిలించాయని, కొన్ని శక్తులు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని ప్రయోగశాలగా మార్చాయన్నారు. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పాసిస్టు ప్రభుత్వం వచ్చాక రైతుల జీవితాలను కట్టుబానిసలుగా మార్చి అంబానీ, ఆదానీలకు తాకట్టుపెట్టేలా నల్ల చట్టాలు తెచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ కొరివి దెయ్యంలా ప్రాజెక్టుల పేరుతో, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో దళిత గిరిజన భూములను లాక్కొని బజార్లో నిలబెట్టాడన్నారు. పోడు భూములకు కాంగ్రెస్ పట్టాలిస్తే హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులతో ఆడబిడలను చెట్లకు కట్టేసి హింసించి గుంజుకుంటున్నారన్నారు.రైతులకు ఉచిత కరెంట్ భూమి, మద్దతు ధరలు అన్ని ఇచ్చి రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ అని తెలిపారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ను ఓడించినప్పుడే రైతులకు, యువతకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని అన్నారు.
ప్రాథమిక విద్య నుంచి వైద్య విద్య వరకు అన్ని రకాల విద్య సౌకర్యాలను కల్పించి బడుగు, బలహీన వర్గాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందన్నారు. దేశాన్ని ఏకతాటిపై ఉంచి అఖండ భారత్ గా నిలిచేలా కాంగ్రెస్ కృషి చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ ఆశయాలను అమలు చేస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచనా విధానాలతో పనిచేసి దేశంలో బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందన్నారు.