Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: గుంటూరు జిల్లా కేంద్రంలో పట్టపగలు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా రమ్య అనే బీటెక్ విద్యార్థిని హత్య చేయడం తనను తీవ్రంగా కలిచివేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకొంటున్న రోజునే గుంటూరులో నడిరోడ్డుపై బీటెక్ విద్యార్థిని రమ్యని అత్యంత కిరాతకంగా హతమార్చడం వైకాపా ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలోనే ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యమైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన రెండేళ్లలో 500కి పైగా మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరిగాయని... నేటికీ చాలా కేసుల్లో నిందితులను పట్టుకోలేదన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోని సీతానగరంలో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగితే నేటికీ నిందితుణ్ని పట్టుకోలేకపోవడానికి కారణమేంటని నిలదీశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మని అత్యాచారం చేసి చంపితే నేటికీ ఆ కేసులో పురోగతి లేకపోవడం విచారకరమన్నారు. రమ్యని అత్యంత దారుణంగా చంపిన హంతకుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో మరో మహిళకు అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.