Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మూడు నెలల క్రితమే పెండ్లి చేసుకున్న ఓ యువతి అనుమానస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో చోటుచేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు స్థానికులు అంటుండగా.. లేదు అది హత్యే అని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఓ తండాకు చెందిన పీనాబాయికు.. జుక్కల్ మండలం దోస్త్పల్లి తండాకు చెందిన వీరేశంతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఉన్నట్టుండి షీనబాయి మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. షీనాబాయి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే కుటుంబ సమస్యల కారణంగానే ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు షీనాబాయి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం.. ఆమెది ఆత్మహత్య కాదని, అదనపు కట్నం కోసం అత్తింటి వారే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.