Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అప్పులు తీర్చలేక, కరోనాతో తమ స్కూలు తెరుచుకోక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోవెలకుంట్లకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కర్నాటి రాధాకృష్ణమూర్తి కుమారుడు సుబ్రహ్మణ్యం (33), కోడలు రోహిణి (27)లు గత నాలుగేండ్లుగా పట్టణంలో లైఫ్ ఎనర్జీ స్కూల్ నిర్వహిస్తున్నారు. స్కూల్ కోసం సుమారు రూ.2 కోట్ల వరకు అప్పుచేశారు. అయితే కరోనాతో స్కూలు నడవకపోవడంతో ఫీజులు వసూలు కాలేదు. అప్పులిచ్చిన వారంతా ఒత్తిడి తేవడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. రోహిణి స్వగ్రామం ఆత్మకూరు కాగా ఆదివారం వారు ఆత్మకూరు నుంచి కోవెలకుం ట్లకు కారులో వస్తూ కరివెన సమీపంలో కారులోనే విష గుళికలు మింగారు. అయితే ఆత్మహత్యకు ముందు వారు ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమంలో అప్లోడ్ చేశారు. దాంతో విషయం తెలుసుకున్న బంధువులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే భర్త మృతి చెందాడు. భార్య కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. విషయం వెలుగుచూసింది.
సెల్ఫీ వీడియోలో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ''ఈ రోజు నేనూ.. నా భార్య చనిపోతున్నాం. విద్యార్థుల టీసీలు ఎంఈవో ఆఫీస్లో కలెక్ట్ చేసుకోండి. మాకు ఫీజులు రాలేదు. అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేశారు. వారి ఒత్తిడి, అవమానం తట్టుకోలేక చనిపోతున్నాం` అంటూ చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు.