Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీపీఐఎంల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పోడు సాగుదారులకు పట్టాలివ్వాలని మంత్రి, ఎమ్మెల్యే కార్యాలయాల ఎదుట ధర్నాకు వెళుతున్న నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆ పార్టీ జిల్లా నాయకురాలు పి.ఝాన్సీ విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నగరంలో ఆర్టీవో కార్యాలయం సెంటర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోడు సాగుదారులతో ప్రభుత్వం ఇలా వ్యవహరించడం తగదన్నారు. ఇప్పటికే పెట్టిన కేసులను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రఘునాథపాలెం మండల కార్యదర్శి మంగతాయి, నాయకులు గౌస్, బాలు, ప్రేమ్‌సింగ్, లక్ష్మణ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.