Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోపిడీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్: తరుగు పేరుతో కోట్లాది రూపాయలను రైతుల నుండి రైస్‌మిల్లు యాజమాన్యం మరియు అధికారులు దోచుకుంటున్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నది. మార్కెట్‌కు తెచ్చిన దాన్యాన్ని రైతుల ముందే తరుగు తీసీ కాంటా వేసి తక్‌పట్టీ ఇస్తారు. ఈ పట్టీ ప్రకారమే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలి. కానీ రైస్‌మిల్లు యాజమాన్యం మరియు అధికారులు కుమ్మక్కై మళ్లీ తరుగు పేరుతో ఒక్కో రైతు ఖాతాలో వేలాది రూపాయలను తగ్గించి జమచేస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. ఈ దోపిడీకి కారణమైన రైస్‌మిల్లు యాజమాన్యం మరియు అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని, తక్‌పట్టీ ప్రకారమే రైతులకు డబ్బులు చెల్లించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం రబ్బీలో మద్దతుధరకు వరిదాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి, ఐకేపీ మరియు పీఏసీఎస్, సంస్థల ద్వారా 92 లక్షల టన్నుల దాన్యం మద్దతు ధరకు కొన్నామని గొప్పగా ప్రకటించింది. తక్‌పట్టీ ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాల్సి ఉండగా, అధికారులు మరియు రైసుమిల్లుల యజమానులు కుమ్ముక్కై నిబంధనలకు విరుద్ధంగా తరుగు పేరుతో తక్కువ డబ్బులు జమచేస్తున్నారు. దీంతో ఏడెనిమిది వందల కోట్ల రూపాయల డబ్బులు రైతులవి దోచుకుని వీరు పంచుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నిజామాబాదు జిల్లాల్లో రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఖరీఫ్‌లో కూడా ఈ దోపిడీ కొనసాగే ప్రమాదమున్నది. ఈ దోపిడీపై విజిలెన్స్ విచారణచేసి సంబంధిత బాధ్యులపై చర్య తీసుకోవాలని, రైతులకు తక్‌పట్టీ ప్రకారం రావాల్సిన డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలసి సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.