Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై మరో కేసు నమోదైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మల్కాజ్ గిరిలో ఆయన బీజేపీ కార్పొరేటర్ వూరపల్లి శ్రవణ్ పై దాడి చేశాడంటూ ఇప్పటికే ఓ కేసు నమోదైంది. తాజాగా మైనంపల్లి పైనా, ఆయన తనయుడు రోహిత్ పైనా మౌలాలి కార్పొరేటర్ సునీతా యాదవ్ ఫిర్యాదు చేశారు. దాంతో వారిద్దరిపై నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. తండ్రీతనయులతో పాటు మరికొందరిపైనా పోలీసులు పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు.
సీఎం కేసీఆర్ ఇవాళ హుజూరాబాద్ లో దళిత బంధు ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన అనుచరులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ క్రమంలో వారిని నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో తమపై మైనంపల్లి, ఆయన అనుచరులు దాడి చేశారని కార్పొరేటర్ సునీతా యాదవ్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.