Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కేవలం ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంచర్లతోనే ఆఫ్ఘనిస్థాన్ ను గజగజలాడించిన చరిత్ర తాలిబన్లది. ఇప్పుడు కూడా కేవలం ఈ ఆయుధాలతోనే ఆఫ్ఘన్ ను వారు చేజిక్కించుకున్నారు. తాలిబన్లతో పోరాడలేక ఆఫ్ఘనిస్థాన్ సైనికులు చేతులెత్తేశారు. ఆయుధాలను వదిలేసి పలాయనం చిత్తగించారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తాలిబన్ల సొంతమయ్యాయి.
గత 20 ఏళ్లలో దాదాపు 89 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులను, 11 వైమానిక స్థావరాలను ఆఫ్ఘనిస్థాన్ కు అమెరికా సమకూర్చింది. ఇవన్నీ ఇప్పుడు తాలిబన్ల వశమయ్యాయి. వీటిని ఉపయోగించడంలో ఆప్ఘన్ సైనికులకు అమెరికా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినప్పటికీ... తాలిబన్లతో పోరాడలేక వారు పారిపోయారు. గత రెండు దశాబ్దాలుగా అమెరికా చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది.
తాలిబాన్ల వశమైన ఆయుధ సంపత్తి వివరాలు:
- ఏ-29 తేలికపాటి విమానాలు - 6
- వేగంగా కదిలే బహుళ ప్రయోజన హమ్వీ వాహనాలు - 174
- 2.75 అంగుళాల హై ఎక్స్ ప్లోజివ్ రాకెట్లు (గగనతలం నుంచి భూతలం పై దాడికి ఉపయోగించే రాకెట్లు) - 10 వేలు
- పాయింట్ 50 క్యాలిబర్ తూటాలు - 9 లక్షలు
- 40 ఎంఎం హై ఎక్స్ ప్లోజివ్ తూటాలు - 60 వేలు
- 7.62 ఎంఎం తూటాలు - 20 లక్షలు
- యూహెచ్ 60 బ్లాక్ హాక్స్ హెలికాప్టర్లు - 45
- ఎండీ 530 హెలికాప్టర్లు- 50
- ఎంఐ 17 హెలికాప్టర్లు - 56
- ఏ 29 సూపర్ తుకానో ఫైటర్లు - 23
- సి 130 హెర్క్యులస్ రవాణా విమానం - 1
- సీ 208 విమానం - 1
మెత్తం మీద 211 విమానాలు, హెలికాప్టర్లకు గాను 167 పనిచేసే స్థితిలో ఉన్నాయి. అయితే, వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో తాలిబన్లకు అవగాహన లేదు. వీటికి పైలట్లు, టెక్నీషియన్లను గుర్తించడం తాలిబన్లకు కఠినమైన పరీక్షే. అంతేకాదు వీటి విడిభాగాలను సేకరించడం కూడా చాలా కష్టమైన పనే. అయితే ఈ కష్టాలను అధిగమిస్తే మాత్రం తాలిబన్లకు ఒక అత్యాధునికమైన వైమానిక దళం ఉన్నట్టే.