Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వగ్రామం హరియాణలోని పానిపట్ సమీపంలోని సమల్ఖాకు బయల్దేరాడు. ఢిల్లీ నుంచి పానిపట్ వరకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరగా స్వగ్రామం చేరుకునేలోపు నీరజ్ అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం నుంచి కారు టాప్‌పై ఉండి అందరికీ అభివాదం చేస్తూ స్వర్ణ పతకం చూపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నాడు. ఆరు గంటల పాటు సాగిన ఈ యాత్రలో నీరజ్ నీరసించిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కొన్నిరోజులుగా నీరజ్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఈ కారణంగానే నీరజ్ గైర్హాజరయ్యాడు. ఒలింపిక్స్ తర్వాత తొలిసారి స్వగ్రామం సమల్ఖాకు మంగళవారం వెళ్లిన నీరజ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. గ్రామస్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నీరజ్‌పై పూల వర్షం కురిపించారు. పిండిపదార్థాలు ప్రత్యేకంగా తయారుచేశారు. పానిపట్‌కు చేరుకున్న అనంతరం నీరజ్ నీరసించడంతో వెంటనే అతడి స్నేహితులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నీరజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని స్నేహితుడు ఒకరు తెలిపారు.