Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లోనూ మహిళలు తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు. అటువంటి కాలంలోనూ ఆడపిల్లలంటే కొందరికి ఇంకా చిన్నచూపే. వారి ఆలోచనలో నేటికీ మార్పు రావడం లేదు. తాజాగా, జరిగిన ఈ ఘటనే అందుకు ఉదాహరణ. మగ సంతానం కోసం ఓ ప్రబుద్ధుడు భార్యకు ఎనిమిదిసార్లు అబార్షన్ చేయించాడు. ఈ క్రమంలో ఆమెకు వందల సంఖ్యలో హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వేయించి దారుణంగా వ్యవహరించాడు.
గుండెల్ని మెలిపెట్టే ఈ ఘటన ముంబయిలోని దాదర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలు (40) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి 2007లో వివాహం జరిగింది. విద్యాధికులు, సంపన్న కుటుంబం కావడంతో ఆమె తండ్రి ఎంతో సంబరపడిపోయాడు. అయితే, ఆ సంతోషం అతడికి ఎన్నాల్లో నిలవలేదు. అత్తింటిలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే 2009లో ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే, 2011లో బాధితురాలు రెండోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో తనకు మగబిడ్డే కావాలంటూ భర్త అబార్షన్ చేయించాడు. మరోవైపు తానూ చికిత్స చేయించుకోవడం మొదలుపెట్టాడు. ప్రీ ఇంప్లాంటేషన్, లింగ నిర్ధారణకు భారత్‌లో అనుమతి లేకపోవడంతో ఆమెను బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఎనిమిది సార్లు అభార్షన్ చేయించాడు. చికిత్స, ఆయా పరీక్షల సమయంలో ఆమెకు 1,500కుపైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇప్పించాడు. అతడి వేధింపులకు తాళలేక విసిగివేసారిపోయిన బాధితురాలు పుట్టింటికి వచ్చేసింది.
తండ్రి సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన కుటుంబం, ఆస్తులను సంరక్షించే వారసుడు కావాలనే ఉద్దేశంతో అకృత్యాలకు పాల్పడ్డాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి భర్త, అత్త న్యాయవాదులు కాగా.. ఆమె ఆడపడుచు డాక్టర్. తొలిసారి పాప పుట్టిన తర్వాత తమకు అబ్బాయి కావాలని వేధింపులకు గురిచేసినట్టు ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన దాదర్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.