Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచిర్యాల: విమాన టికెట్లు సిద్ధమై, మరికొద్ది రోజుల్లోనే తిరిగివస్తాడనుకున్న ఇంటిపెద్ద అనూహ్యంగా అఫ్గానిస్థాన్లో చిక్కుకుపోవటంతో ఆయన కుటుంబం భయాందోళనలకు లోనవుతోంది. ఆయనను క్షేమంగా ఇంటికి చేర్చాలని కేంద్ర సర్కారును వేడుకుంటోంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొమ్మన రాజన్న.. ఎనిమిదేళ్లుగా అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో ఏసీసీఎల్ సంస్థలో పనిచేస్తున్నారు. గత జూన్ 28న అక్కడి నుంచి స్వస్థలానికి తిరిగివచ్చిన ఆయన.. ఈనెల ఏడో తేదీనే అక్కడకు వెళ్లారు. ఈలోగా కాబుల్ సహా దేశమంతా తాలిబాన్ల వశమైన నేపథ్యంలో అక్కడి భయానక వాతావరణం లోంచి బయటపడేందుకు దారులన్నీ మూసుకుపోయాయని ఆయన వాపోయారు. ప్రస్తుతం తనతో పాటు కరీంనగర్ జిల్లా ఒడ్డారానికి చెందిన వెంకన్న కూడా విధుల్లోనే ఉన్నారని.. ఈ నెల 18న ఇండియాకు వచ్చేందుకు తమ సంస్థ టికెట్లు సిద్ధం చేసినా విమానాలు అందుబాటులో లేవని మంగళవారం రాత్రి రాజన్న ఫోన్లో మాట్లాడుతూ తెలిపారు. తనని సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. మరోవంక.. ఇంటిపెద్ద అఫ్గానిస్థాన్లో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్న కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. రాజన్నను సురక్షితంగా తమ చెంతకు చేర్చాలని ఆయన భార్య వసంత, కుమార్తె రమ్య సర్కారును కోరుతున్నారు.