Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైరాబాద్: పెట్రోల్ బంకులో పెట్రోలుకు బదులు నీళ్లు రావడం ఈ మధ్య చూశాం. పెట్రోల్ పంపు నుంచి పెట్రోల్ కాకుండా నీళ్లు రావడం చూసి వాహనదారులు ఖంగుతిన్నారు. ఇదెక్కడి మోసం అని ప్రశ్నించారు. అయితే, తాజాగా అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన ఇస్మాయిల్ జబివుల్లా.. గ్యాస్ వినియోగదారుడు. తాజాగా ఆయన సిలిండర్ బుక్ చేయగా డెలివరీ వచ్చింది. ఇస్మాయిల్ పాత సిలిండర్ తీసి డెలివరీ వచ్చిన కొత్త సిలిండర్‌ను బిగించగా పొయ్యిలో మంట రాలేదు. సిలిండర్ బరువుగా ఉంది.. లిక్విడ్ ఊగినట్టు శబ్దం వస్తోంది.. అయినా మంట రాకపోవడంతో జబివుల్లాకు అనుమానం వచ్చింది. దీంతో పిన్ను సాయంతో సిలిండర్‌లో ఉన్న లిక్విడ్‌ను చిన్న ప్లాస్టిక్ పాత్రలోకి తీశారు. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అయితే ఆవిరైపోవాలి. కానీ, పాత్రలోకి తీసిన లిక్విడ్ నీళ్లలానే ఉంది. దీంతో అగ్గిపుల్ల వెలిగించి ఆ లిక్విడ్‌లో పెట్టారు. ఎలాంటి రియాక్షన్ లేదు. దీంతో అవి నీళ్లేనని నిర్ధారణకు వచ్చారు. దీనికిపై గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. కానీ, వారు పట్టించుకోవలేడం లేదని బాధితుడు అంటున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే గ్యాస్ సిలిండర్లలో ఇలా జరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.