Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వినాయక నిమజ్జనంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిల్ వేయగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారించింది. ఇప్పటికే కలుషితమైన హుస్సేన్‌సాగర్‌లో రసాయనిక రంగులతో కూడిన విగ్రహాల నిమజ్జనం జరగకుండా ఎలా నిరోధిస్తారో స్పష్టం చేయాలని పేర్కొంది. అలాగే వినాయక నిమజ్జనం సందర్భంగా భారీగా జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హైకోర్టుకు హాజరుకావాలని పేర్కొంది.
వినాయక చవితి పండగను ఇండ్లలోనే ఉంటూ నిరాడంబరంగా మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే సూచనలు కాదని, స్పష్టమైన ఆదేశాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదే కానీ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని చెప్పింది. రెండు సార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ నివేదికలు సమర్పించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణ సెప్టెంబరు 1కి వాయిదా పడింది.